శ్రీసిటీలో ‘పేక్స్ ఇండియా’ నీటి నాణ్యత టెస్టింగ్ ల్యాబ్ ప్రారంభం

శ్రీసిటీ, డిసెంబర్ 10, 2025:
శ్రీసిటీలోని పేక్స్ ఎన్విరాన్‌మెంటల్ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (PETI) సంస్థ తమ ఆవరణలో ఏర్పాటు చేసిన అత్యాధునిక NABL నీటి/మురుగునీటి నాణ్యత టెస్టింగ్ ల్యాబ్‌ను బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ల్యాబ్ ప్రారంభోత్సవం సందర్భంగా డా. సన్నారెడ్డి మాట్లాడుతూ, శ్రీసిటీని ‘క్లీన్ & గ్రీన్’ పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దే సంకల్పానికి ఇది మరో మైలురాయిగా అభివర్ణించారు. దీని ద్వారా పరిశ్రమలకు వేగవంతమైన, ఖచ్చితమైన, విశ్వసనీయ నీటి పరీక్షా సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. 2015లో పేక్స్ ఇండియా తమ ప్లాంట్ ఏర్పాటుకు వివిధ ప్రాంతాలు పరిశీలిస్తున్న తరుణంలో, గ్రీన్ ఎనర్జీలో ప్రపంచవ్యాప్త ప్రాధాన్యత కలిగిన ఆ సంస్థను శ్రీసిటీకి తెచ్చేందుకు తాము కృషి చేసినట్లు తెలిపారు. ల్యాబ్ ఏర్పాటు ద్వారా పేక్స్ ఇండియా సంస్థ శ్రీసిటీ సుస్థిర పర్యావరణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.
పేక్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సుదీప్ సంగమేశ్వరన్ మాట్లాడుతూ, ఈ కొత్త ల్యాబ్ ‘మేక్ ఇన్ ఇండియా’ ఆలోచనకు అనుగుణంగా అత్యాధునిక టెస్టింగ్ సేవలను అందిస్తుందన్నారు. శ్రీసిటీ పరిశ్రమలు మరియు పరిసర ఇతర సంస్థలు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.
సంస్థ వైస్ ప్రెసిడెంట్ (మాన్యుఫ్యాక్చరింగ్ & అప్లికేషన్) గణేష్ చిదంబరం కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు ల్యాబ్ గురించి వివరించారు. యూరోపియన్ ప్రమాణాలతో అభివృద్ధి చేసిన ఈ సదుపాయంలో 30కి పైగా అంశాలలో నీరు, మురుగునీరుకు సంబంధించిన సర్టిఫైడ్ టెస్టింగ్ అందుబాటులో ఉందని తెలిపారు. ముఖ్యంగా, ప్రత్యేక బయోమెథేన్ పొటెన్షియల్ (BMP) టెస్టింగ్ ద్వారా పరిశ్రమలు బయోగ్యాస్ రికవరీ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చని చెప్పారు.
కాగా, నెదర్లాండ్స్‌కు చెందిన పేక్స్ ఇండియా కంపెనీ 2016లో ₹30 కోట్ల పెట్టుబడితో శ్రీసిటీలో ఉత్పత్తి యూనిట్‌ను స్థాపించింది. పల్ప్ అండ్ పేపర్, ఫుడ్ అండ్ బెవరేజెస్, పెట్రోకెమికల్ రంగాలకు అధునాతన రియాక్టర్ భాగాలను ఇది తయారు చేస్తుంది. ప్రస్తుతం దీనిని అనుబంధంగా ల్యాబ్ ఏర్పాటు ద్వారా టెస్టింగ్ సేవలు అందించనుంది.
