
పెరుమళ్ళపాడు, జనవరి 4 : *తాను నమ్ముకున్న భూమి తనదే అనే ధైర్యాన్ని ప్రతి రైతుకు కల్పిస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.*
ఆదివారం చేజర్ల మండలం పెరుమాళ్లపాడు గ్రామంలో “మీ భూమి – మీ హక్కు” నినాదంతో నిర్వహించిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని రైతులకు ప్రభుత్వ రాజముద్రతో ముద్రించిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ గత ప్రభుత్వం పంపిణీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాలు చట్టబద్ధత లేనివని, అవి ఇంట్లో ఉంటే అరిష్టమని వ్యాఖ్యానించిన మంత్రి, వాటిని తిరిగి ఇచ్చేయాలని రైతులను కోరారు. ప్రభుత్వ రాజముద్ర, క్యూఆర్ కోడ్, భద్రతా ప్రమాణాలతో ప్రస్తుతం అందిస్తున్న పాస్ పుస్తకాలు పూర్తిగా చట్టబద్ధమైనవని తెలిపారు.
కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలలోని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే భూ యజమానికి సంబంధించిన పూర్తి వివరాలు తక్షణమే కనిపిస్తాయని, వీటిలో ఎలాంటి మార్పులైనా డేటా సెంటర్ ద్వారా మాత్రమే చేయగలమని స్పష్టం చేశారు. ఏ చిన్న తప్పు జరిగినా వెంటనే సరిదిద్దుతామని హామీ ఇచ్చారు.
గత ప్రభుత్వం ఎన్నికలకు మూడు నెలల ముందు 35 లక్షల మంది రైతుల పాస్ పుస్తకాలను మార్చిందని, కోటి మంది రైతుల భూ హక్కులను గందరగోళానికి గురిచేసిందని విమర్శించారు. రీసర్వే పేరుతో హద్దురాళ్లపై కూడా గత సీఎం బొమ్మలు ముద్రించి రూ.650 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు.
నెల్లూరు జిల్లాలో 235 గ్రామాల్లో 1.05 లక్షల మందికి పైగా రైతులకు గత సీఎం బొమ్మతో కూడిన పాస్ పుస్తకాలు పంపిణీ చేయగా, ఆత్మకూరు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 13 గ్రామాల్లో 5,486 పాస్ పుస్తకాలు పంపిణీ చేశారని తెలిపారు. వీటి స్థానంలో ప్రస్తుతం ప్రభుత్వ రాజముద్రతో కూడిన నూతన పాస్ పుస్తకాలను అందిస్తున్నామని చెప్పారు.
విద్యుత్ ట్రూఅప్ చార్జీలను పూర్తిగా రద్దు చేశామని మంత్రి ప్రకటించారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ.32,166 కోట్ల ట్రూఅప్ చార్జీలను వసూలు చేసిందని, ఇక నుంచి ప్రజలపై భారం వేయకుండా ప్రభుత్వం ఏడాదికి రూ.4,497 కోట్లను భరిస్తుందని తెలిపారు. తిరుపతి రీజియన్ పరిధిలో రూ.1,551.69 కోట్ల మేర ప్రజలకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు.
ఆత్మకూరు నియోజకవర్గంలోని సంగం మండలం అన్నారెడ్డిపాలెం, చేజర్ల మండలం పెరుమాళ్లపాడుకు నూతన విద్యుత్ సబ్ స్టేషన్లు మంజూరు చేశామని తెలిపారు. పెరుమాళ్లపాడులోని పురాతన శివాలయం పునర్నిర్మాణానికి రూ.1.50 కోట్లు మంజూరు చేసి, శుభ ముహూర్తంలో పనులు ప్రారంభిస్తామని చెప్పారు.
2026 డిసెంబర్ నాటికి రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి రైతులకు చట్టబద్ధ భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలకు సుపరిపాలన అందిస్తూ రామరాజ్య స్థాపన దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తలపనేని నర్సమ్మ, ఆర్డీవో పావని, రెవెన్యూ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
