Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

టిటిడి ఆలయాల ప్రాశస్త్యాన్ని తెలియజేసేందుకు వర్చువల్ రియాలిటీ సహకారం

పత్రికా ప్రకటన

తిరుపతి, 2026, జనవరి 03.

 

టిటిడి ఆలయాల ప్రాశస్త్యాన్ని తెలియజేసేందుకు వర్చువల్ రియాలిటీ సహకారం

స్థానిక, అనుబంధ ఆలయాల కైంకర్యాల సేవలపై ఎస్వీబీసీ ద్వారా విస్తృత ప్రచారం

 

స్థానిక అనుబంధ ఆలయాలకు ప్రత్యేక అధికారుల ఏర్పాటు – టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్

 

టిటిడి స్థానిక, అనుబంధ ఆలయాల ప్రాశస్త్యాన్ని భక్తులకు అందించేందుకు వర్చువల్ రియాలిటీ సహకారం తీసుకోవాలని టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ అధికారులకు సూచించారు. టిటిడి పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో టిటిడి ఉన్నతాధికారులతో శనివారం టిటిడి ఈవో సమీక్ష నిర్వహించారు.

 

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, టిటిడి స్థానిక, అనుబంధ ఆలయాల ప్రాశస్త్యం, శిల్ప సౌందర్యం తదితర ప్రధాన అంశాలను భక్తులకు చేరవేసేందుకు అవసరమైతే ఆగుమెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ సాయం తీసుకుని, ఇందుకోసం ప్రత్యేక యాప్ ను రూపొందించే అంశాన్ని పరిశీలించాలన్నారు. ఆలయాల శిల్పాలు, చిత్రాలను భక్తులు సెల్ ఫోన్ తో స్కాన్ చేసినట్లు అయితే సంబంధిత పౌరాణిక, చారిత్రక ప్రాశస్త్యాన్ని తెలియజేసేలా నూతన టెక్నాలజీతో అనుసంధానం చేయాలని సూచించారు. అదేవిధంగా, తిరుమల శ్రీవారి ఆలయం కైంకర్యాలను ఎస్వీబీసీ ఛానల్ లో అందిస్తున్న తరహాలో టిటిడి స్థానిక ఆలయాలు, అనుబంద ఆలయాల విశిష్టతను భక్తులకు అందించేందుకు అవసరమైతే ఎస్వీబీసీ ఆధ్వర్యంలో మరో ఛానల్ తీసుకువచ్చే అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నారు.

 

టిటిడి అనుబంధ, స్థానిక ఆలయాలలో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు. ప్రత్యేక అధికారులు తరచుగా ఆలయాలను సందర్శించి ఆలయాల అభివృద్ధి పనులపై నివేదికలు రూపొందించేలా చర్యలు చేపట్టాలన్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు ఆదేశాల మేరకు టిటిడి ఆలయాలలో అన్నదానం పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. అందులోభాగంగా ప్రతి ఆలయానికి జనరల్ అకౌంట్, అన్నదానం కోసం మరో అకౌంట్ తెరిపించి సదరు రెండు అకౌంట్లను ప్రత్యేక అధికారులు పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఇప్పటికే అన్నప్రసాదాల కోసం ఉన్న అకౌంట్లను కొనసాగించాలన్నారు. భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, సిసిటివీలు, సెక్యూరిటీ, రవాణా, ట్రాఫిక్ తదితర అంశాలపై టిటిడి సివిఎస్వోతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఆలయాలలో సరైన సమయానికి కైంకర్యాలు, వాహన సేవలకు సంబంధించి, ప్రధాన ఉత్సవాల నిర్వహణ కోసం ముందస్తు ప్రణాళికలు, భక్తులకు వైద్యసేవలు, శ్రీవారి సేవకుల సేవలు, పుష్కరిణిని పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు, బడ్జెట్, వ్యర్థాల నిర్వాహణ, మరుగుదొడ్లు తదితర అంశాలపై ప్రణాళికబద్ధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

 

ఈ సమావేశంలో టిటిడి జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ కె.వి. మురళీకృష్ణ, ఎఫ్ఏఅండ్ సిిఏవో శ్రీ ఓ బాలాజీ, సీఈ శ్రీ టివి సత్యనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు.

——————–

టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Related posts

ఆగని వర్షం.. స్తంభించిన జనజీవనం!!

Garuda Telugu News

స్వపక్షంలోనే.. విపక్షం..!!

Garuda Telugu News

స్క్రబ్ టైఫస్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి – ఎంపీ గురుమూర్తి

Garuda Telugu News

Leave a Comment