Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ ఆపండి – కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసిన వైసీపీ ఎంపీల బృందం

*మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ ఆపండి – కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసిన వైసీపీ ఎంపీల బృందం*

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము స్థాపించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు సంస్థలకు అప్పగించే చర్యల పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ పేరుతో భారీ ర్యాలీలు, ఉద్యమాలు నిర్వహించింది. ఈ నేపధ్యంలో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల బృందం బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ని కలిసి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణ జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు.

ఈ భేటీలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ లీడర్ వైవి. సుబ్బా రెడ్డి, వైసీపీ లోక్ సభ ఫ్లోర్ లీడర్ మిధున్ రెడ్డి, రాజ్యసభ ఫ్లోర్ లీడర్ పిల్లి సుభాష్ చంద్ర బోస్, రాజ్యసభ ఎంపీలు మేడా రఘునాధ రెడ్డి, అయోధ్య రామి రెడ్డి, గొల్ల బాబు రావు, లోక్ సభ ఎంపీలు మద్దిల గురుమూర్తి, గుమ్మా తనూజా రాణి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రైవేటీకరణ తక్షణమే ఆపాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు టిడిపి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని, దీనివల్ల పేద, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు, ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన విద్యార్థులు వైద్య విద్య అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్మించిన మెడికల్ కాలేజీల భూములను తక్కువ ధరలకు ప్రైవేటు సంస్థలకు లీజ్ ఇవ్వాలనే ఆలోచనలు కూడా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర అనుమానాలకు తావిస్తున్నాయని, ఇదే సమయంలో ప్రభుత్వ వైద్య సేవలలో నాణ్యత లోపించి, సామాన్య ప్రజలకు వైద్యం దూరమవుతుందని వారు పేర్కొన్నారు.

వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 17 కొత్త మెడికల్ కాలేజీలలో 7 ఇప్పటికే పూర్తి చేసి, పేద మరియు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్యను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం ఎంపీలు మంత్రికి గుర్తుచేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్రంలో వైద్యుల కొరత సృష్టించి, ప్రభుత్వ ఆసుపత్రుల సేవలను దెబ్బతీసేలా ఉన్నాయని వారు తెలిపారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ప్రజల ఆందోళన వ్యక్తమవుతున్నదని, ఇప్పటివరకు ఒక కోటి కంటే ఎక్కువ సంతకాలు సేకరించబడినట్లు ఎంపీలు వివరించారు. ఈ సంతకాలను రాష్ట్ర గవర్నర్‌కు ఈ నెల 17వ తేదీన సమర్పించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటు చేతుల్లోకి ఇవ్వకూడదనే ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ, ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలంటూ వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేశారు.

Related posts

ఎపిలో సెకండరీ/శాటిలైట్ ఎండిఎఫ్ యూనిట్ ఏర్పాటు చేయండి

Garuda Telugu News

వృద్ధులకు దుప్పట్లు పంపిణీ 

Garuda Telugu News

గ్రీన్ జర్నీ పేరుతో ప్రజల రక్తం పీలుస్తున్నారు.. ప్రభుత్వంపై కవిత తీవ్ర విమర్శలు

Garuda Telugu News

Leave a Comment