Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయండి

*తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయండి*

*రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ కు మరోసారి వైసీపీ ఎంపీలు గురుమూర్తి, మేడా రఘునాధ రెడ్డి వినతి*

 

 

తిరుపతి జిల్లాలో రైల్వే సేవల అభివృద్ధికి సంబంధించి కేంద్ర రైల్వే శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్‌తో వైసీపీ లోక్‌సభ ఎంపీ మద్దిల గురుమూర్తి, రాజ్యసభ ఎంపీ, రైల్వే స్టాండింగ్ కమిటీ మెంబర్ మేడా రఘునాధ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్బంగా పలు కీలక అభ్యర్థనలు చేశారు. తిరుపతి ప్రాంత రైల్వే వ్యవస్థను బలోపేతం చేయడం, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసం వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఆయనకి వివరించారు.

 

ముఖ్యంగా కొన్ని దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న బాలాజీ రైల్వే డివిజన్‌ను తిరుపతి కేంద్రంగా ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. దేశంలోనే తిరుపతి అత్యంత రద్దీ ఉన్న పుణ్యక్షేత్రం అని రైల్వే మంత్రికి వివరించారు. కాగా ప్రస్తుతానికి రైల్వే లైన్లు పలు డివిజన్లలో విభజించబడడంతో పరిపాలనా సమస్యలు, పనుల అనుమతుల కోసం జాప్యం, వెరసి సేవల నాణ్యతలో లోపాలు ఎదురవుతున్నాయని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తిరుపతి రైల్వే స్టేషన్‌ కూడా రూ.300 కోట్లతో అప్‌గ్రేడేషన్ చేస్తుండడంతో బాలాజీ డివిజన్ ఏర్పాటు అవసరాన్ని మరింత బలపరుస్తుందని ఆయనకి స్పష్టం చేశారు. బాలాజీ డివిజన్ ఏర్పాటు అంశంపై ఎంపీ గురుమూర్తి గతంలో రెండు దఫాలు పార్లమెంటులో ప్రస్తావించిన విషయం విదితమే.

 

అలాగే, ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు తిరుపతి వెస్ట్ రైల్వే స్టేషన్‌లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని అత్యవసరంగా ఆమోదించాలని ఎంపీ గురుమూర్తి విజ్ఞప్తి చేశారు. వెస్ట్ రైల్వే స్టేషన్‌లో దక్షిణం వైపు దారి మూసివేతతో ఎమ్మార్ పల్లి, పద్మావతి నగర్, ఎస్‌వీ నగర్, ఉల్లిపట్టెడ ప్రాంతాల ప్రజలు, విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని, వారు సురక్షితంగా రాకపోకలు సాగించేందుకు ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి అత్యంత కీలకమని మంత్రికి వివరించారు. అలాగే నగరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త, మాజీ మంత్రి రోజా విజ్ఞప్తి మేరకు పుత్తూరు యార్డ్ కిమీ 111/800–900 స్థానిక ధర్మరాజుల గుడి ఎదురుగా రైల్వే ట్రాక్ సమస్యను అధిగమించేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ర్యాంపు ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు.

 

అదేవిధంగా, ప్రజల డిమాండ్ మేరకు వెందోడు, నాయుడుపేట రైల్వే స్టేషన్లలో పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు స్టాపేజీలు కల్పించాలని ఎంపీలు ఆయనని కోరారు. నవజీవన్ ఎక్స్‌ప్రెస్, భగత్ కి కోఠి, ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్‌లకు నాయుడుపేటలో స్టాపేజీ ఇవ్వడం, అలాగే కృష్ణా ఎక్స్‌ప్రెస్, తిరుపతి–పూరీ ఎక్స్‌ప్రెస్, తిరుమల ఎక్స్‌ప్రెస్ తోపాటుగా తిరుపతి, గూడూరు ప్యాసింజరు రైళ్లను పునరుద్ధరణ చేయాలని వారు అభ్యర్థించారు. తిరుపతి పరిసర ప్రాంతాల అభివృద్ధికి అత్యవసరమైన ఈ అంశాలను పరిశీలించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఎంపీలు కేంద్ర రైల్వే శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్ ని కోరారు.

Related posts

రామయ్య పట్నంలో ఏర్పాటు చేయబోయే బీపీసీఎల్ రిఫైనరీ మీద రాజ్యసభలో ప్రశ్నించిన శ్రీ బీద మస్తాన్ రావు యాదవ్

Garuda Telugu News

30.3 అడుగులకు చేరిన అరణియార్ నీటిమట్టం

Garuda Telugu News

ఎమ్మెల్యే గారిచే హాస్టల్ వీధి సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ

Garuda Telugu News

Leave a Comment