శ్రీవారి సేవ ‘ట్రెయిన్ ద ట్రైనీస్’ శిక్షణా కార్యక్రమం ప్రారంభం

శ్రీవారి సేవకులు హిందూ ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్లు
టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి
తిరుమల, 02 డిసెంబర్ 2025: రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శ్రీవారి సేవను మరింత బలోపేతం చేయడంలో భాగంగా వారిలోని నైపుణ్యాలను అభివృద్ధి చేయడమే ‘ట్రెయిన్ ద ట్రైనీస్’ శిక్షణా కార్యక్రమం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి అన్నారు.
మంగళవారం తిరుమలలోని సేవా సదన్–2లో గ్రూప్ సూపర్వైజర్ల (మాస్టర్ ట్రైనర్లు)లకు నిర్వహించిన తొలి బ్యాచ్ ‘ట్రెయిన్ ద ట్రైనీస్‘ శిక్షణా కార్యక్రమానికి ఆయన విచ్చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవారి సేవకులు హిందూ ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్లు అని చెప్పారు. దేశవిదేశాల నుండి తిరుమలకు విచ్చేస్తున్న భక్తులకు సేవ చేయడంలో శ్రీవారి సేవకుల పాత్ర అత్యంత కీలకమైనది తెలిపారు.
ఈ శిక్షణా కార్యక్రమం ద్వారా తమ తమ ప్రాంతాల్లోని శ్రీవారి సేవకులకు గ్రూప్ సూపర్వైజర్లు శిక్షణ ఇచ్చేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్, ఐఐఎం–అహ్మదాబాద్ నిపుణులు శిక్షణ మాడ్యూల్‌లను రూపొందించినట్లు చెప్పారు.
ఈ శిక్షణలో వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాల పెంపు, కమ్యూనికేషన్, భక్తులతో నడవడిక, నాయకత్వ లక్షణాలు, టీటీడీ చరిత్ర, శ్రీవారి సేవ ప్రాముఖ్యత, పురాణాల పరిజ్ఞానం తదితర అంశాలు ఉంటాయన్నారు. దీనికోసం ఆయా అంశాల్లో నిష్ణాతుల ద్వారా శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు.
ఈ శిక్షణ పొందిన గ్రూప్ సూపర్వైజర్లు తమ ప్రాంతాల్లో శ్రీవారి సేవకు నమోదు చేసుకున్న శ్రీవారి సేవకులకు సేవకు రాకమునుపే శిక్షణ అందించి వారిని భక్తులకు ఉన్నతమైన సేవలు అందించే విధంగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని ఆయన తెలిపారు.
ఈ శిక్షణ తరగతుల సారాన్ని గ్రహించి, ఇతర సేవకులను కూడా సమర్థవంతంగా తీర్చిదిద్దిద్దాలని గ్రూప్ సూపర్వైజర్లలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో పండితులు డా. మేడసాని మోహన్, డా. దామోదర్ నాయుడు, డా. శ్రీనివాస్, టీటీడీ ఛీఫ్ వీఆర్వో డాక్టర్ టి.రవి, పీఆర్వో (FAC) కుమారి నీలిమ, సేవా సదన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.
