*సాగరమాల రహదారుల నిర్మాణంలో అదనపు సౌకర్యాల కోసం రూ.98 కోట్ల మంజూరు – ఎంపీ గురుమూర్తి*

చిల్లకూరు క్రాస్ రోడ్ నుంచి తుర్పుకనుపూర్ వరకు, అలాగే తుర్పుకనుపూర్ నుంచి పోర్ట్ సౌత్ గేట్ వరకు నిర్మిస్తున్న సాగర మాల రహదారుల నిర్మాణానికి అవసరమైన అదనపు రహదారి సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. రహదారుల నిర్మాణం జరిగే ప్రాంతాలలోని సమస్యలని స్థానిక ప్రజాప్రతినిధులు ఎంపీ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సమస్యల పరిష్కారానికి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి ఆయనకి వివరించారు. ఎన్ హెచ్ -516 డబ్ల్యూ పై ప్యాకేజ్–II పరిధిలో 4-లైన్ల యాక్సెస్ కంట్రోల్డ్ హైవే నిర్మాణానికి గతంలో ఆమోదం లభించింది. ఇందులో భాగంగా జాతీయ రహదారి-16 వద్ద 1.050 కిమీ పొడవులో 6-లైన్ల ఫ్లైఓవర్ మరియు దానికి సంబంధించిన అప్రోచ్ రోడ్లు కూడా నిర్మాణంలో ఉన్నాయి. ఈ మొత్తం పనులను హైబ్రిడ్ అన్యుయిటీ మోడ్‌లో చేపడుతున్నారు. ఇదిలా ఉండగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉత్పన్నమైన సమస్యల పరిష్కారం కోసం, పలు అదనపు సౌకర్యాల కల్పన కోసం కోసం రూ.98.07 కోట్లు కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎంపీ గురమూర్తి తెలిపారు. ప్రాంత ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తాను కోరిన అదనపు సదుపాయాలను వెంటనే పరిగణలోకి తీసుకుని ఆమోదం ఇచ్చినందుకు ఎంపీ గురుమూర్తి గారు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు.
