*పుట్ పాత్ లపై ఆక్రమణలు తొలగించండి.*
*కమిషనర్ ఎన్. మౌర్య.*

నగరంలోని పుట్ పాత్ లపై ఉన్న ఆక్రమణలను తొలగించి పాదచారులకు ఇబ్బందులు లేకుండా చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులు ఆదేశించారు. ప్రజా పిర్యాదుల పరిష్కారం వేదికలో వచ్చిన పిర్యాదుల మేరకు శుక్రవారం ఉదయం నగరంలోని గరుడ సర్కిల్, రుయా సర్కిల్, జూ పార్క్ రోడ్డు తదితర ప్రాంతాలను అధికారులతో కలసి కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పుట్ పాత్ లను ఆక్రమించి తోపుడు బండ్లు, టిఫిన్ బండ్లు ఏర్పాటు చేయడంతో పాదాచారులకు ఇబ్బందులు వస్తున్నాయనే పిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని అన్నారు. జూ పార్కు వెళ్లే మార్గంలో కూడా టిఫిన్ బండ్లు ఎక్కువయ్యాయని, వారు వ్యర్థాలు రోడ్డు పక్కన పడేస్తున్నారని అన్నారు. దీని వలన వన్యప్రాణులు రోడ్లపైకి వచ్చి మనుషులపై దాడి చేస్తున్నాయని తెలిపారు. ఇంజనీరింగ్, హెల్త్, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు పోలీసులతో సమన్వయం చేసుకుని పుట్ పాత్ లపై ఉన్న బండ్లు తొలగించాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట మునిసిపల్ ఇంజినీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, ఏసిపి మధు, డి.ఈ మధు, శానిటరీ సూపర్ వైజర్ చెంచయ్య తదితరులు ఉన్నారు.
