*తుఫాన్ నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి*
*: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్*
తిరుపతి, అక్టోబర్ 26:

*తుఫాన్ నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలనిజిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు.ఆదివారం సాయంత్రం గూడూరు డివిజన్,వాకాడు మండలం, బాలిరెడ్డి పాలెం వద్ద గతంలో దెబ్బతిన్న కట్ట మరమ్మతు పనులను పరిశీలించిన అలంకారం పాత్రికేయులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు.*
*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,బంగాళాఖాతం లో ఏర్పడిన తుఫాన్ ప్రస్తుతం కాకినాడ–విశాఖపట్నం తీరానికి దాదాపు 900 కిలోమీటర్ల దూరంలో ఉందన్నారు. ఈ తుఫాన్ రానున్న రెండు రోజులలో ఉత్తర–పశ్చిమ దిశగా కదిలి, కాకినాడ సమీప తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపిందన్నారు.ఈ తుఫాన్ ప్రభావం కారణంగా ఈనెల 27, 28, 29 అక్టోబర్ తేదీలలో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత జిల్లాలు అంతటా భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.భూమిని తాకే సమయంలో తుఫాన్ గాలి వేగం 90–100 కి.మీ/గం వరకు ఉండవచ్చన్నారు. తిరుపతి జిల్లాలోని కొన్నిమండలాల్లో 60–70 కి.మీ/గం వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.సోమవారం సాయంత్రం నుంచి 29వ తేదీ వరకు వీలైనంతవరకు జిల్లా లోని ప్రజలు ఇంట్లోనే ఉండాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.వర్షాల సమయంలో కాల్వలు, చెరువులు, నదుల వద్దకు వెళ్లరాదని సూచించారు.*
*జిల్లాలో శిథిలావస్థలో ఉన్న ఇళ్లు లేదా భవనాల్లో నివసించే వారు ముందుగానే సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లాలన్నారు.అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు.
ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్, ఇంజనీరింగ్ శాఖలు అన్నీ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.తుఫాన్ కారణంగా ఎక్కడైనా చెట్లు, విద్యుత్ తీగలు లేదా ఇళ్లపై నష్టం జరిగితే వెంటనే కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.ప్రజల ప్రాణ–ఆస్తి రక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఈ దిశలో
జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉందన్నారు. జిల్లాలో నాయుడుపేట, శ్రీకాళహస్తిలో ఎస్జిఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచామని, అలాగే మరో బృందాన్ని కూడా గూడూరులో ఉంచడం జరుగుతుందన్నారు. ఎక్కడా ఎటువంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు.ప్రజలందరూ ప్రభుత్వ సూచనలు పాటించి,అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లరాదని జిల్లా కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.*
ఈ కార్యక్రమంలో గూడూరు ఇంఛార్జి ఆర్డీవో భాను ప్రకాష్ రెడ్డి, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశి, ఇరిగేషన్ ఎస్సీ రాధాకృష్ణమూర్తి ,గూడూరు,వాకడు మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
