తిరుమల, 2025 అక్టోబరు 01
వీక్షకులను అలరించిన సంగీత నృత్య ప్రదర్శన

శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన బుధవారం తిరుపతిలోని పలు వేదికలపై టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలతో పురప్రజలు పులకించారు.
ఇందులో భాగంగా తిరుపతి మహతి కళాక్షేత్రంలో మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు తిరుపతి శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకురాలు డా. వందన బృందం గాత్ర సంగీత కచేరి జరిగింది.
ఇందులో కమలాప్తకుల కలశాబ్ది చంద్ర అన్న త్యాగయ్య కీర్తనతో ప్రారంభమవ్వగా, శ్రీ డుమ్ దుర్గే అన్న ముత్తుస్వామి దీక్షితుల కీర్తనతో సాగి, కరుణ ఏలాగంటే అనే మరొక త్యాగయ్య కీర్తనతో, తదుపరి అన్నమాచార్యుని మాయలో మోహమున కీర్తన, నంద నందన గోపాల నారాయణ తీర్థుల తరంగం సభను భక్తి సాగరంలో ముంచెత్తింది.
వీరికి వయొలిన్ పై కొమండూరి కృష్ణ, మృదంగం పై కోటిపల్లి కృష్ణలు సహకరించారు.
అనంతరం
“రామాయణం- సీతా స్వయంవరం” నృత్యరూపకం కూచిపూడి సంప్రదాయంలో ఆచార్య పసుమర్తి రామలింగశాస్త్రి బృందం చక్కటి హావ భావాలతో నృత్యం చేసి సభను మంత్రముగ్ధుల్ని చేశారు.
అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు బెంగళూరుకు చెందిన శ్రీమతి అర్చన బృందం భక్తి సంగీతం, శ్రీ రామచంద్ర పుష్కరణి వేదికలో సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు తమిళనాడుకు చెందిన శ్రీమతి ప్రణతి వైజర్స్ బృందం భక్తిసంగీత కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో తిరుపతి పుర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
—————————————-
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది
