ఏపీ కనీస వేతనాల సలహా మండలి సభ్యులు గా జయరామిరెడ్డి…

పార్టీలో క్రమశిక్షణ, నిబద్దత కలిగిన నేతగా గుర్తింపు…
తిరుపతి, అక్టోబర్ 01:
తెలుగు నాడు ట్రేడ్ యూనియన్ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులుగా ఉన్న తెరణి జయరామిరెడ్డి ని ఏపీ కనీస వేతనాల సలహా మండలి సభ్యులు గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. జయరామిరెడ్డి కెవిబి పురం మండలం, అరే గ్రామానికి చెందినవారు. ఈయన తెలుగుదేశం పార్టీలో గత రెండు దశాబ్దాలకు పైగా కొనసాగుతున్నారు. 2021 లో జయరామిరెడ్డి టి ఎన్ టి యు సి తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులుగా నియమితులైయారు. అప్పటినుంచి పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో కార్మికుల సంక్షేమంతో పాటు తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ఎనలేని సేవలు అందించారు. యువ నేత, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేపట్టిన సమయంలో జయరామిరెడ్డి రాష్ట్రవ్యాప్తంగా నారా లోకేష్ వెంబడి పర్యటించి ఆయన దృష్టిలో పడ్డారు. అంతేకాకుండా 2024 సార్వత్రిక ఎన్నికలలో పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కీలకంగా పనిచేశారు. ఆయన పార్టీ కోసం చేసిన సేవలను గుర్తించి పార్టీ అధిష్టానం ఏపీ కనీస వేతనాల సలహా మండలి సభ్యులుగా నియమించింది. ఈ సందర్భంగా జయరాం రెడ్డి మాట్లాడుతూ తనకు ఈ పదవి రావడానికి సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, యువనేత విద్యా శాఖ మంత్రి నారా లోకేష్, టిఎన్టియుసి రాష్ట్ర అధ్యక్షులు గుట్టుముక్కల రఘురామరాజు, టిడిపి తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్, పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్ రెడ్డి, కురుగొండ్ల రామకృష్ణ, పాశ్యం సునీల్ కుమార్, నెలవల విజయ్ శ్రీ, పులివర్తి నాని, సత్యవేడు నియోజకవర్గ ఇన్చార్జ్ కూరపాటి శంకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసి రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలచిపోయారన్నారు. మహిళలకు స్త్రీ శక్తి పేరిట ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం కల్పించడం మహిళలలో మంచి స్పందన ప్రభుత్వం పట్ల లభించిందని జయరాం రెడ్డి తెలిపారు. రాబోయే మూడున్నర సంవత్సరములు రాష్ట్రం నెంబర్ వన్ దిశగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, కార్పొరేట్ రంగాలలో పనిచేస్తున్న కార్మికులకు కూటమి ప్రభుత్వ ఆదేశానుసారం కనీస వేతనాలు అమలయ్యేలా చూడటంతో పాటు వారి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. ఈయన రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఏపీ కనీస వేతనాల సలహా మండలి సభ్యులుగా నియమితులైన జయరామిరెడ్డిని పలువురు తెలుగుదేశం ప్రజా ప్రతినిధులు నాయకులు, టి ఎన్ టి యు సి నేతలు కలసి అభినందనలు తెలిపారు.
