Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

వైభవంగా శ్రీవారి రథోత్సవం

తిరుమల, 2025 అక్టోబరు 01

 

వైభవంగా శ్రీవారి రథోత్సవం

– భక్తిశ్రద్ధలతో రథాన్ని లాగిన భక్తులు

 

– గోవిందనామస్మరణతో మారుమోగిన మాడవీధులు

 

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజైన బుధవారం ఉదయం 7 నుండి 9 గంటల వరకు ఉభయదేవేరులతో కూడిన శ్రీమలయప్పస్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు.

 

బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజున ఉభయ దేవేరులతో మలయప్పస్వామిని మహోన్నత రథంపై అధిష్ఠింపజేసి ఆలయ వీధులలో విహరింపజేశారు. శ్రీవారికి భక్తులు అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు. గోవిందనామస్మరణతో ఆలయ మాడవీధులు మారుమోగాయి.

 

అనాదికాలం నుండి రాజులకు రథసంచారం ప్రసిద్ధం. యుద్ధాలలో కూడా విరివిగా రథసంచారం జరిగినట్లు భారతాది గ్రంథాలు వివరిస్తున్నాయి. శ్రీహరి గరుడధ్వజుడై నాలుగు గుర్రాలతో కూడిన రథంపై విహరిస్తాడు. ఇక ప్రసిద్ధ దేవాలయాలలో ఉత్సవవేళలో దేవుని ఉత్సవమూర్తిని రథంపై ఉంచి ఊరేగించే ఆచారం, ఆగమశాస్త్ర సిద్ధమై బహుళ ప్రచారంలో ఉంది.

 

తిరుమలలో రథోత్సవం అన్నివిధాలా ప్రసిద్ధమైంది. ’రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మనవిద్యతే ’ అన్న ఆర్షవాక్కులు రథోత్సవం మోక్షప్రదాయకమని వివరిస్తున్నాయి. తిరుమాడ వీధులలో రథాన్ని లాగేటప్పుడు ప్రమాదాలు జరుగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. రథానికి తాళ్ళుకట్టి వీధులలో భక్తులు, అధికారులు అందరూ రథాన్ని ముందుకు లాగారు.

 

రథోత్సవానికి విశిష్టమైన ఆధ్యాత్మికార్థం ఉంది. కఠోపనిషత్తులో ఆత్మకు, శరీరానికీ ఉండే సంబంధాన్ని రథరూపకల్పనతో వివరించడం జరిగింది. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో – స్థూలశరీరం వేరనీ, సూక్ష్మశరీరం వేరనీ, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్త్వజ్ఞానమిదే. భక్తులు రథాన్ని లాగుతారు, కానీ, అన్నమయ్య సకలజీవులలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ తనరథాన్ని తానే లాగుతున్నాడని అనడం సముచితం.

 

ఈ కార్యక్రమంలో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టీటీడీ ఛైర్మ‌న్ శ్రీ బీఆర్ నాయుడు, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, పలువురు బోర్డు స‌భ్యులు, జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ మురళి కృష్ణ,

ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

Related posts

ఆంధ్ర ప్రదేశ్ మొదలియార్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో స్టేట్ డైరెక్టర్

Garuda Telugu News

రేణిగుంట రోడ్డుపై రైల్వే గేటు నంబర్ 107 వద్ద రోడ్ అండర్ బ్రిడ్జ్‌కు అదనపు యాక్సెస్ రోడ్డుకు రైల్వే శాఖ ఆమోదం

Garuda Telugu News

శ్రీవారి హుండీలో బంగారం అపహరణ

Garuda Telugu News

Leave a Comment