Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

దేశ పురోగ‌తిలో తిరుప‌తి ఐఐటీ ప్రధాన భూమిక

*దేశ పురోగ‌తిలో తిరుప‌తి ఐఐటీ ప్రధాన భూమిక*

*-వైసీపీ ఎంపీ డాక్ట‌ర్ మ‌ద్దిల గురుమూర్తి ప్ర‌శంస‌*

దేశ పురోగ‌తిలో తిరుప‌తి ఐఐటీ ప్రధాన భూమిక పోషిస్తుందని తిరుపతి ఎంపీ డాక్ట‌ర్ గురుమూర్తి ప్ర‌శంసించారు. తిరుప‌తి ఐఐటీ శాశ్వ‌త క్యాంప‌స్ అభివృద్ధి ప‌నుల్లో భాగంగా రూ.2313 కోట్ల అంచనాలతో ఫేజ్‌-బీ ప‌నుల‌కు శ‌నివారం ప్ర‌ధాని నరేంద్ర మోదీ వ‌ర్చువ‌ల్ విధానంలో భూమి పూజ చేశారు. ముఖ్య అతిథిగా హాజ‌రైన ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ తిరుపతి ఐఐటీ రెండో దశ నిర్మాణానికి శంకుస్థాపన జరగడం ఈ ప్రాంతానికి గర్వకారణమ‌న్నారు. అలాగే చారిత్రక రోజన్నారు. ఇది కేవలం భవనాల నిర్మాణం మాత్రమే కాదు యువ‌త ఉజ్వ‌ల భ‌విష్య‌త్ నిర్మాణ‌మ‌న్నారు. ఇందుకోసం సుస్థిరమైన మౌలిక సదుపాయాలను క‌ల్పిస్తూ, విద్యార్థుల ఆవిష్కరణలకు, పరిశోధనలకు కొత్త దారులు తీసుకువస్తున్న ప్రాజెక్టుగా ఆయన అభిప్రాయ‌ప‌డ్డారు. త‌క్కువ స‌మ‌యంలోనే ఐఐటీ ప‌రిశోధ‌న ఫ‌లితాలు అందుతున్నాయ‌ని ఆయ‌న ప్ర‌శంసించారు. దేశంలోనే ప్ర‌తిష్టాత్మ‌క‌మైన డీఆర్‌డీఏ, టాటా, జేఎస్‌డ‌బ్ల్యూ లాంటి సంస్థ‌ల‌తో తిరుప‌తి ఐఐటీ స‌మ‌న్వ‌యంతో ముందుకెళుతూ పరిశ్రమలకు బలం చేకూర్చి, స్థానిక ఆర్థిక వ్యవస్థపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపిందన్నారు.

 

అదే సమయంలో ఈ ప్రాంతంలోని మామిడి, టమాటా రైతులకు ఉపయోగ‌ప‌డేలా ఆహార ప్రాసెసింగ్ రంగంపై కూడా ఐఐటీ తిరుపతి దృష్టి సారించిందన్నారు. వ్య‌వ‌సాయ రంగానికి కూడా త‌న ప‌రిశోధన ఫ‌లాల్ని అందిస్తోంద‌ని ఆయ‌న కొనియాడారు. దీని ద్వారా రైతులకు సాంకేతికత, ఆవిష్కరణలు, వృద్ధి అందుబాటులోకి వస్తాయన్నారు. రెండో దశలో సుమారు 2,500 మంది విద్యార్థులకు సేవలందించనున్న ఈ సంస్థ యువతకు, ప్రాంత అభివృద్ధికి గొప్ప తోడ్పాటు అందిస్తోంద‌న్నారు.

 

ఈ ప్రాజెక్టును ఆమోదించి తిరుపతికి కేటాయించినందుకు గాను ప్రధానమంత్రికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. దేశానికి నిజమైన దూరదృష్టి గల నాయకుడైన ఆయన ఎప్పుడైనా తిరుపతి అభివృద్ధి కోసం కోరినప్పుడు అపారమైన సహకారం అందిస్తున్నారని ఆయ‌న కొనియాడారు. ఈ ప్రాంత ప్రజల తరపున ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామ‌ని ఎంపీ మద్దిల గురుమూర్తి పేర్కొన్నారు.

 

ప్ర‌ధాని చొర‌వ‌తో అభివృద్ధి ప‌నులు చేప‌ట్ట‌డంతో విద్యార్థులు త‌మ క‌ల‌ల్ని సాకారం చేసుకునే అవ‌కాశం ల‌భిస్తుంద‌న్నారు. దేశాన్ని ముందుకు న‌డ‌పడంలో ఐఐటీ నుంచి వ‌చ్చే యువ‌త కీల‌క పాత్ర పోషిస్తున్నార‌ని ఆయ‌న కొనియాడారు. మ‌రీ ముఖ్యంగా త‌న సొంత మండలంలో ఉన్న ఐఐటీకి అద‌న‌పు సౌక‌ర్యాలు క‌ల్పించిన ప్ర‌ధాని మోదీకి ధ‌న్య‌వాదాల‌న్నారు. గ‌తంలో వైసీపీ హ‌యాంలో వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తిరుప‌తి ఐఐటీ మొదటి ఫెజ్ నిర్మాణానికి ఎంతో తోడ్పాటు అందించార‌న్నారు. దేశం ప్ర‌గ‌తి ప‌థంలో ముందుకెళ్ల‌డానికి ప్ర‌త్యేక భూమిక తిరుప‌తి ఐఐటీ పోషిస్తోంద‌న్నారు. ఇలాంటి కార్య‌క్ర‌మంలో తాను పాల్గొన‌డం సంతోషంగా, గ‌ర్వంగా వుంద‌న్నారు.

Related posts

తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాలతో నూతన సంవత్సర వేడుకలపై నిఘా

Garuda Telugu News

పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పులివర్తి నాని

Garuda Telugu News

ఏప్రిల్ నుంచి పల్లెబాట : సీఎం చంద్రబాబు

Garuda Telugu News

Leave a Comment