*ఘనంగా ప్రపంచ ఔషధ నిపుణుల దినోత్సవం*

తిరుపతి, సెప్టెంబర్ 25 :
ప్రపంచ ఔషధ నిపుణుల దినోత్సవం (ఫార్మసిస్టుల దినోత్సవం) ను ఆంధ్రప్రదేశ్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ చిత్తూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం ఎస్.వి. వైద్య కళాశాల ఫార్మకాలజీ విభాగంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని ఎస్.వి. వైద్య కళాశాల అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ జి. రవి ప్రభు, రుయా ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ జె. రాధా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ జి. రవి ప్రభు మాట్లాడుతూ “వైద్యరంగంలో ఫార్మసిస్టుల పాత్ర ఎంతో ప్రధానమైనది. వైద్యులు రోగులకు చికిత్స సూచించిన తర్వాత, ఔషధాల వినియోగంపై సరైన మార్గదర్శకత్వం ఇచ్చేది ఫార్మసిస్టులే. వీరు పేద రోగుల కొరకు అహర్నిశలు సేవలందిస్తూ, వైద్యరంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారు” అని తెలిపారు.
రుయా సూపరిటెండెంట్ డాక్టర్ జె. రాధా మాట్లాడుతూ “ఆసుపత్రులందు ఔషధ నిపుణుల అవసరం మరింత పెరుగుతోంది. వైద్య పరిశోధనలోనూ, రోగి సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు వెళ్ళడంలోనూ వీరి సేవలు కీలకం” అని అభిప్రాయపడ్డారు.
ఫార్మకాలజీ విభాగ అధిపతి డాక్టర్ భారతి మాట్లాడుతూ “ఫార్మసిస్ట్లు ఆసుపత్రులకు మాత్రమే కాకుండా, వైద్య విద్యార్థులకు ఔషధ శాస్త్రం, ప్రయోగ పద్ధతులు బోధించడంలోనూ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పి. నాదముని, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ అరుణ్ సెల్వకుమార్, జిల్లా కోశాధికారి ఎం. నరేష్, కొండయ్య సిపిఓ, ప్రభాకర్ ఎస్‌పిఓ, గిరిధర్, శశిధర్, రామకృష్ణ, బాలరాజు నాయుడు, చంద్రకళ, సుష్మ, నాగేంద్ర, ఇందుమతి, జిల్లా ఫార్మసిస్టులు మరియు ఎస్.వి. వైద్య కళాశాల పి.ఆర్.ఓ. వీర కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
