
*ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి*
*ఏయూకి పూర్వవైభవం తీసుకురావాలి*
*ప్రపంచంలోనే టాప్-100లో ఏయూ నిలిచేలా లక్ష్యంగా పెట్టుకోవాలి*
*ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల నిర్వహణపై మంత్రి నారా లోకేష్ సమీక్ష*
ఉండవల్లిః ఎంతో ఘన చరిత్ర కలిగిన విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన సహాయ, సహకారాలను అందిస్తామని చెప్పారు. ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల నిర్వహణ, యూనివర్సిటీ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై వైస్ ఛాన్స్ లర్ జీపీ రాజశేఖర్ తో ఉండవల్లిలోని నివాసంలో మంత్రి లోకేష్ సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ ఏడాది ఏప్రిల్ 26వ తేదీన ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల ప్రారంభ వేడుకను నిర్వహించనున్నట్లు వీసీ వివరించారు. 1926లో ఆంధ్ర యూనివర్సిటీని స్థాపించారు. 2026, ఏప్రిల్ 26వ తేదీ వరకు ఏడాదిపాటు ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ విజన్ ను వీసీ జీపీ రాజశేఖర్ ఆవిష్కరించారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ఎంతో చరిత్ర కలిగిన ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఘనంగా నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. విశ్వవిద్యాలయానికి పూర్వవైభవం తీసుకురావాలన్నారు. క్యూఎస్ ర్యాంకింగ్స్ లో ఆంధ్ర యూనివర్సిటీ టాప్-100లో స్థానం పొందడమే లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. ఇందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. త్వరలోనే యూనివర్సిటీల్లో ఖాళీలను భర్తీచేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్(ఏపీఎస్ సీహెచ్ఈ) ఛైర్మన్ ప్రొఫెసర్ కె.మధుమూర్తి, కాలేజియేట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
