
*స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గొంతు నొక్కితే …ప్రజాస్వామ్య వ్యవస్థకు చేటు*
*గురుకుల పాఠశాలల సమస్యలపై నిలదీసిన తిరుపతి ఎంపీ*
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గొంతు నొక్కితే ప్రజాస్వామ్య వ్యవస్థకే చేటు అని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమ హక్కులు సంబంధిత అధికారులు కాలరాస్తున్నారని జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఎంపీతో గొంతు కలపడం విశేషం. ఏ పార్టీ అధికారంలో ఉన్నా స్థానిక సంస్థలకు ఖచ్చితంగా ప్రాధాన్యం ఇవ్వాల్సిందే అని ఎంపీ స్పష్టం చేశారు.
కానీ కూటమి పాలనలో రాజ్యాంగం అపహాస్యం అయ్యేలా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఎంపీ విరుచుకుపడ్డారు. ఇదే సందర్భంలో జిల్లా వ్యాప్తంగా హాజరైన పలువురు జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు మాట్లాడుతూ తమ తీర్మానాలకు కనీస విలువ కూడా అధికారులు ఇవ్వలేదని ధ్వజమెత్తారు.
తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని గురుకుల పాఠశాలల సమస్యలపై ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి నిలదీశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం చిత్తూరులో మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ గురుమూర్తి కీలక అంశాల్ని ప్రస్తావించారు.
శ్రీకాళహస్తి, సత్యవేడు, తిరుపతి నియోజకవర్గాల్లో గురుకుల పాఠశాలల్లో సమస్యలను గుర్తించేందుకు ఎన్ని సార్లు తనిఖీలు చేశారని గురుమూర్తి ప్రశ్నించారు. ఎన్ని సమస్యల్ని గుర్తించారు? వాటి పరిష్కారానికి ఎఏ్ని నిధులు ఖర్చు చేశారని ఆయన నిలదీశారు.
ఇందుకు తిరుపతి డీఈవో కుమార్ స్పందిస్తూ కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థులకు వైద్యం అందించామన్నారు. మళ్లీ అలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని డీఈవో సమాధానం ఇచ్చారు. అలాగే హాస్టళ్లలో వారానికి ఒకసారి కూరగాయలు కొనుగోలు చేయడం వల్ల చెడిపోతున్నాయని, అలా కాకుండా ఏ రోజుకారోజు తీసుకోవాలని ఎంపీ సూచించారు.
సత్యవేడులో ఒక దఫా, అదే నియోజకవర్గంలోని బీఎన్ కండ్రిగలో రెండు దఫాలు విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయాన్ని ఎంపీ సభ దృష్టికి తీసుకెళ్లారు.
