*ఆగని వర్షం.. స్తంభించిన జనజీవనం!!*

*నేడు చెన్నై సహా 4 జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు*
చెన్నై: ‘దిత్వా’ తుఫాన్ తీరందాటకుండానే బలహీనపడుతుండటంతో నగరంలో సోమవారం వేకువజాము నుంచి సాయంత్రం దాకా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో జనజీవనం స్తంభించింది. ఆదివారం రాత్రి నుంచే పెనుగాలులతో నగరం, శివారు ప్రాంతాల్లోనూ వర్షం దంచికొట్టింది. వేకువజామున కాసేపు విరామం తర్వాత ఉదయం 7 గంటల నుంచి వర్షం కురిసింది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాలకు వాతావరణ కేంద్రం అధికారులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ఈ జిల్లాల్లో చెదురుమదురుగా వర్షం కురిసింది.
చేపాక్, ట్రిప్లికేన్ రాయపేట, మైలాపూరు, పట్టినంబాక్కం, ప్యారీస్ కార్నర్, వాషర్‌మెన్‌పేట, టి.నగర్, కోడంబాక్కం, కీల్పాక్, కోయంబేడు తదితర ప్రాంతాల్లో ఉదయం నుంచి విరామం లేకుండా కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రహదారులపై మోకాలిలోతున వర్షపునీరు ప్రవహించింది. దీంతో వాహన చోదకులు, ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నగరంలోని కొన్ని ప్రైవేటు పాఠశాలలు హాఫ్‌డే సెలవు ప్రకటించాయి. ఇక నగర శివారుప్రాంతాల్లోనూ చెదురుమదురుగా వర్షం కురవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
రహదారుల్లో వర్షపునీరు ప్రవహిస్తుండటంతో పూందమల్లి – చెన్నై సెంట్రల్, సెంట్రల్ తాంబరం మార్గాలలో వాహనాలు నత్తనడక నడిచాయి. పోరూరు, అయ్యప్పన్ తాంగళ్, పెరుంగుడి, పెరుంగళత్తూరు ప్రాంతాల్లో కొన్ని గంటలపాటు ట్రాఫిక్ స్తంభించింంది. రహదారులపై వర్షపు నీరు వరదలా ప్రవహించడంలో బస్సులు, ఆటోలు, కార్లు నత్తనడక నడిచాయి. ఉదయం 7 గంటల నుంచే పూందమల్లి హైరోడ్డులో సెంట్రల్ వైపు, తిరువేర్కాడు వైపు వెళ్లే బస్సులు గమ్యస్థానాలను గంటకుపైగా ఆలస్యంగా చేరుకున్నాయి. విధంగా పోరూర్ జంక్షన్, గిండి, కోయంబేడు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
అండమాన్ విమానాల రద్దు…
నగరంలో వేకువజాము నుంచి ఎడతెరపిలేకుండా కురిసిన భారీ వర్షాలకు విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షాలు, అండమాన్‌లో ప్రతికూల వాతావరణ పరిస్థితు ల కారణంగా అండమాన్‌కు వెళ్ళాల్సిన రెండు విమాన సర్వీసులు, అదే విధంగా అండమాన్ నుండి నగరానికి రావాల్సిన రెండు విమాన సర్వీసులను రద్దు చేశారు. ఇదే విధంగా పలు నగరాల వైపు ప్రయాణించే విమానాలు కూడా ఆలస్యంగానే బయలుదేరాయి.
నేడు విద్యాసంస్థలకు సెలవు
సోమవారం రాత్రి భారీగా వర్షం కురిసే అవకాశం ఉన్న చెన్నై, పరిసర జిల్లాలకు వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించడంతో ఆ జిల్లాల్లోని విద్యా సంస్థలకు చెన్నై కలెక్టర్ రష్మి సిద్దార్థ్ మంగళవారం సెలవు ప్రకటించారు. ఇదే విధంగా తిరువళ్లూరు, చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు కూడా ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవు ప్రకటించారు.
జలాశయాల్లో పెరిగిన ఇన్‌ఫ్లో
సోమవారం రోజంతా కురిసిన భారీ వర్షానికి నగరానికి తాగునీరందించే నాలుగు జలాశయాల్లో నీటి పరిమాణం క్రమంగా పెరుగుతోంది. చెంబరంబాక్కం, పుళల్, చోళవరం, పూండి జలాశయాల్లో ఇన్‌ఫ్లో పెరుగుతోంది.
