Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

మనుషుల్లో ప్రేమ ఉన్నంతవరకు సత్యసాయి బాబా మనమధ్యే ఉంటారు

*మనుషుల్లో ప్రేమ ఉన్నంతవరకు సత్యసాయి బాబా మనమధ్యే ఉంటారు*

*ఇక్కడకు వచ్చినపుడల్లా బంగారూ అని బాబా పిలచినట్లుగా అన్పిస్తుంది*

*భగవాన్ శ్రీ సత్యసాయి బాబా చూపిన బాటలో మనమంతా నడవాలి*

*ప్రపంచస్థాయి ప్రమాణాలతో సత్యసాయి ట్రస్ట్ విద్య, వైద్య సేవలు*

*భగవాన్ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో మంత్రి నారా లోకేష్*

పుట్టపర్తి: ప్రశాంతి నిలయం ప్రశాంతతకు ఆలయం… ఇక్కడికి వచ్చినప్పుడల్లా “బంగారు” అని బాబా గారు నన్ను పిలిచినట్లుగా అనిపిస్తుంది… మనుషుల్లో ప్రేమ ఉన్నంత వరకు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మన మధ్యలోనే ఉంటారని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా ప్రశాంతి నిలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, ప్రముఖ బాలీవుడ్ సినీనటి ఐశ్వర్యరాయ్ బచ్చన్, పలువురు రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… ఈరోజు కేవలం వేడుక కాదు, ఇది లోతైన, దైవిక కృతజ్ఞతా క్షణం. ప్రేమ, సేవ, శాశ్వతమైన విలువల ద్వారా మానవాళిని మార్చిన వందేళ్ల పవిత్ర ప్రయాణం.

 

భగవాన్ శ్రీ సత్య సాయిబాబా చారిత్రాత్మక శతాబ్ది ఉత్సవాల నిర్వాహకులకు హృదయపూర్వక అభినందనలు. బాబా గారి శత జయంతి ఉత్సవాల్లో పాల్గోనడం నా అదృష్టం. మనం నిజం మాట్లాడితే, సత్యసాయిబాబా మనతోనే ఉంటారు. భగవాన్ చెప్పినట్లు.. సేవే కులం… సమానత్వమే మతం…ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు పవిత్రమైనవి. సత్యసాయి చూపించిన మార్గం ‘అందరినీ ప్రేమించు – అందరికి సేవ చేయి’… ‘ఎప్పటికీ సహాయం చేయి – ఎవరినీ బాధించకు’.. ఆయన చూపిన బాటలో మనమంతా నడవాలి. “నా జీవితం నా సందేశం” అని ఆయన జీవితాన్ని మనకు పాఠంగా నేర్పారు.

 

ఒక మారుమూల గ్రామంలో పుట్టిన ఒక దైవిక లక్ష్యం… నేడు ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మికత, సేవకు ప్రతిరూపంగా విరాజిల్లుతోంది. బాబాగారి జీవితం…ఖండాలు, సంస్కృతులు, విశ్వాసాలు, వయసుతో సంబంధం లేకుండా లక్షలాది మందికి ప్రేరణగా నిలుస్తోంది. బాబా గారి బోధనలు ప్రపంచ ప్రేమ, సమత, స్వార్థరహిత సేవను నిర్వచిస్తూ ప్రతి మనిషికి సందేశం అందిస్తుంది. భగవాన్ చూపిన పవిత్ర మార్గాన్ని అనుసరిస్తూ, శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్, శ్రీ సత్య సాయి సేవా సంస్థలు సమాజానికి విశేషమైన సేవలను అందిస్తున్నాయి. బాబా చూపిన కరుణను మార్గదర్శకంగా తీసుకొని ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఆరోగ్య సంరక్షణను అందిస్తున్నారు. సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పటల్స్ ద్వారా కీలకమైన శస్త్రచికిత్సలు చేస్తూ లక్షలాదిమందికి పునర్జన్మ నిస్తున్నారు.

 

సత్యసాయి సంస్థలు విలువలతో కూడిన విద్యను అందించడం ద్వారా యువ హృదయాల జీవిత లక్ష్యాన్ని సాకారం చేస్తున్నాయి. విద్యార్థుల్లో సమాజం పట్ల బాధ్యత, విలువలను పెంపొందించే అభ్యాస సంస్థలుగా సేవలందిస్తున్నాయి. సురక్షిత తాగునీటి ప్రాజెక్టులను, పట్టణాలు, గ్రామాలు, మారుమూల గిరిజన ప్రాంతాలకు అనుసంధానించి ప్రజారోగ్యాన్ని సంరక్షిస్తూ వాస్తవ ప్రగతిని సాధిస్తున్నాయి. నేటి యువత సాంకేతికత + కరుణ, ఆవిష్కరణ + సానుభూతి కలయికతో కూడిన లక్షణాలు కలిగి ఉండాలి. మీరు నేర్చుకునే విద్య, ఆరోగ్యం, తాగునీరు, నైపుణ్యం, గ్రామీణాభివృద్ధిలో వాస్తవ సవాళ్లను పరిష్కరించేలా ఉండాలి. ప్రభుత్వ పాలనలో వివిధ విభాగాలు, వ్యాపారం, సైన్స్, స్టార్టప్ లకు నేడు నైతిక మేథస్సు అవసరం.

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా యువతకు ఇచ్చిన సందేశం ఇదే.

 

పేదలకు ప్రేమతో సహాయం అందించాలి అని బాబా చెప్పిన మాటలు నాకు స్పూర్తి. భగవాన్ చెప్పినట్లుగా – పిల్లలకు చిన్నప్పటి నుండే నైతిక విలువలు నేర్పడం నా ధ్యేయం. మనుషుల్లో దేవుడుని చూశారు భగవాన్. ప్రేమతో ప్రపంచాన్ని గెలిచారు. సేవతో ప్రజలకు దేవుడు అయ్యారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా చూపిన మార్గాన్ని అందరూ ఆచరించాలి. కుల, మత, ప్రాంతీయ విభజనలు వద్దు. పేదలకు సాయం చేయాలి. సత్యం మాట్లాడండి. ఇది భగవాన్ కి మనం శతజయంతి సందర్భం గా ఇచ్ఛే ఘన నివాళి. కేంద్ర ప్రభుత్వం భగవాన్ సత్యసాయి పేరుతో ప్రత్యేకంగా రూ.100 నాణేలు, పోస్టల్ స్టాంపులు విడుదల చేస్తున్నందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి… ఏపీ ప్రజలు, సత్యసాయి భక్తుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు మంత్రి లోకేష్ చెప్పారు.

Related posts

వచ్చే నెల 12 నుంచి ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలు

Garuda Telugu News

ఆంధ్ర జ్యోతి విలేకరి రాహుల్ కు ఎమ్మెల్యే ఆదిమూలం పరామర్శ

Garuda Telugu News

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనే ఆయనకు మనమిచ్చే ఘన నివాళి

Garuda Telugu News

Leave a Comment