*అభివృద్ధి, సంక్షేమం అందరికీ అందేలా చేస్తాం*
*ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం*
*పిచ్చాటూరు లో పక్కా ఇల్లు గృహ ప్రవేశం, జాబ్ మేళా ప్రకటన*
*నారాయణవనంలో చేనేత కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ*
*ఎంఈఓ కార్యాలయ ప్రహరీ ప్రారంభోత్సవం లో ఎమ్మెల్యే*

అభివృద్ధి, సంక్షేమం పథకాలు అందరికీ అందేలా చూస్తామని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్పష్టం చేశారు. బుధవారం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పిచ్చాటూరు, నాగలాపురం మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఉదయం 11 గంటలకు పిచ్చాటూరు ఎంపీడీఓ కార్యాలయానికి సమీపంలో ఎన్టీఆర్ గృహ కల్ప పథకం ద్వారా ఓ లబ్ధిదారుడు పూర్తి చేసిన పక్కా ఇల్లు గృహప్రవేశ వేడుకల్లో అధికారులతో కలిసి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పాల్గొన్నారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకొని నియోజకవర్గంలో నిర్వహించనున్న జాబ్ మేళా పై ఎమ్మెల్యే ప్రకటన చేశారు. అక్కడ నుండి నారాయణవనం చేరుకొని చేనేత కార్మికులకు బియ్యం, నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. తదుపరి నారాయణవనం ఎంఈఓ కార్యాలయానికి నూతనంగా నిర్మించిన ప్రహరీ గోడ ను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అందించే అన్నీ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి అందించాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. మరో రెండు రోజుల్లో జరగనున్న జాబ్ మేళా పై విస్తృతం గా ప్రచారం నిర్వహించి ఎక్కువ సంఖ్యలో యువత పాల్గొనే విధంగా చూడాలని స్కిల్ డెవలప్మెంట్ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఫైనాన్స్ కమిటీ చైర్మన్ కోనేటి సుమన్ కుమార్, ఏఎంసీ మాజీ చైర్మన్ డి ఇలంగోవన్ రెడ్డి, నెట్ క్యాప్ మాజీ చైర్మన్ ఆర్ డి యాకాంబరం, అధికారులు, ప్రజా ప్రతినిధులు, కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
