*శ్రీవారి రథోత్సవ సేవలో ఎమ్మెల్యే ప్రశాంతమ్మ*

– టిటిడి ఛైర్మన్, ఈవోతో కలిసి స్వామివారి రథాన్ని లాగిన ఎమ్మెల్యే
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజైన బుధవారం ఉదయం రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. ఉభయదేవేరులతో ఆశీసులైన శ్రీమలయప్పస్వామివారి రథోత్సవంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గారితో కలిసి కోవూరు ఎమ్మెల్యే, టిటిడి బోర్డు మెంబర్ శ్రీ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొని రథాన్ని లాగారు. ముందుగా ఉభయ దేవేరులతో మలయప్పస్వామిని మహోన్నత రథంపై అధిష్ఠింపజేసి ఆలయ వీధులలో విహరింపజేశారు. శ్రీవారికి భక్తులు అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు. గోవిందనామస్మరణతో ఆలయ మాడవీధులు మారుమోగాయి. శ్రీహరి గరుడధ్వజుడై నాలుగు గుర్రాలతో కూడిన రథంపై విహరించారు. తిరుమలలో రథోత్సవం అన్నివిధాలా ప్రసిద్ధమైందని వేద పండితులు చెబుతారు. రథోత్సవ కార్యక్రమంలో పలువురు బోర్డు సభ్యులు, జెఈవో శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో మురళి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
