*పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయండి*

*✍️ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం*
✍️ *పెద్దపాడేరు లో సమస్యలు పరిష్కారానికి ఎమ్మెల్యే చొరవ*
✍️ *గ్రామంలో కలియతిరిగిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం*
బుచ్చినాయుడు కండ్రిగ మండలం పెద్ద పాడేరులో పెండింగ్ సమస్యలు వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అధికారులకు సూచించారు.
బుధవారం గ్రామంలో పెన్షన్ పంపిణీకి హాజరైన ఎమ్మెల్యే ఎదుట గ్రామస్తులు పెండింగ్ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
గ్రామంలో స్మశానానికి దారి లేదని, స్మశానం అధ్వానంగా ఉన్నట్లు స్థానిక ప్రజలు ఎమ్మెల్యే కు విన్నవించారు. స్పందించిన ఎమ్మెల్యే ఉపాధి నిధులతో స్మశానానికి దారి సౌకర్యం, స్మశానం అభివృద్ధి పనులు చేపట్టాలని ఎంపీడీవోకు సూచించారు.
గ్రామంలో పంచాయతీ భవనం నిర్మాణానికి నిధులు మంజూరై నెలల గడుస్తున్న నిర్మాణం చేపట్టకపోవడంపై ఎమ్మెల్యే ఆరా తీశారు. వెంటనే పనులు ప్రారంభించి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
అలాగే అదే గ్రామంలో త్రీ ఫేస్ విద్యుత్ సరఫరాకు విద్యుత్ స్తంభాలన్నీ ఏర్పాటు చేసి ఇంకా ట్రాన్స్ఫార్మర్ పెట్టకపోవడం ఏంటని విద్యుత్ శాఖ అధికారులను ఎమ్మెల్యే ప్రశ్నించారు. వెంటనే విద్యుత్ శాఖ ఈఈ కి ఫోన్ చేసి రెండు రోజుల్లో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి పూర్తిస్థాయి విద్యుత్ సరఫరా అందించాలని ఎమ్మెల్యే కోరారు.
గ్రామంలో ఓ దివ్యాంగునికి రూ.15 వేలు పెన్షన్ మంజూరు కావాల్సి ఉందని, వెంటనే ఈ ప్రక్రియ ప్రారంభించి అతనికి రూ.15000 పెన్షన్ మంజూరు అయ్యేలా చూడాలని ఎమ్మెల్యే సూచించారు.
గ్రామంలో మరో కోటి రూపాయలు శ్రీనిధి రుణాలు అందించాలని వెలుగు అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.
అలాగే పెద్ద పాడేరు గ్రామంలో ఇప్పటివరకు ఒక్క మురికి కాలువ కూడా నిర్మాణం చేపట్టలేదని, వెంటనే మురికి కాలువలకు ప్రతిపాదన సిద్ధం చేయాలని స్థానిక ఏఈకి, ప్రతిపాదనలకు నిధులు కేటాయించాలని అక్కడే ఉన్న పీఆర్ జిల్లా ఎస్.ఈ మధుసూదన్ ను కోరారు.
నిత్యం గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలను నేరుగా పరిశీలించి వాటి పరిష్కారానికి కృషి చేయడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
తమ గ్రామంలో కలియతిరిగి, స్వయంగా సమస్యలను వీక్షించి, పరిష్కారానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యేకు గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు.
