*చివరి వినియోగదారుని వరకు జిఎస్టీ ఫలాలు అందాలి*
➖ వ్యాపారులందరూ తప్పకుండా జిఎస్టీ 2.0ను అమలు చేయాలి
➖ ఎవరైనా ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు
➖ వినియోగదారుల ఫిర్యాదుల కోసం 1915 టోల్‌ఫ్రీ నెంబరు ఏర్పాటు
➖ 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్

నెల్లూరు, సెప్టెంబర్ 28 : ప్రజలకు మేలు చేయాలనే గొప్ప లక్ష్యంతో ప్రభుత్వాలు తీసుకొచ్చిన జిఎస్టీ 2.0 ఫలాలు చివరి వినియోగదారుని వరకు అందించడం మనందరి సామాజిక బాధ్యత అని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ అన్నారు.
ఆదివారం ఉదయం నెల్లూరు నగరంలోని ట్రంకురోడ్డులో గల లలిత కన్వెన్షన్ సెంటర్‌లో నెల్లూరు చార్టెడ్ అకౌంట్స్, ట్యాక్స్ బార్ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో జిఎస్టీ 2.0 సూపర్ జిఎస్టీ.. సూపర్ సేవింగ్స్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో లంకా దినకర్ మాట్లాడుతూ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వాలు అమలుచేస్తున్న జిఎస్టీ సంస్కరణలను వారికి సంపూర్ణంగా అందించడం సామాజిక, నైతిక బాధ్యతగా ఆయన చెప్పారు. వ్యాపారులు, ఆడిటర్లు, అధికారులు, ట్రేడ్ యూనియన్లు అందరూ సమన్వయంతో జిఎస్టీ ఫలాలు ప్రజలకు చేరువ చేయాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ సాధనే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 56వ జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టి ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కల్పించినట్లు చెప్పారు. నాలుగు రకాలుగా ఉన్న పన్ను విధానాన్ని కేవలం రెండు రకాల కే పరిమితం చేశారని, దీంతో 90శాతం మంది ప్రజలకు కొనుగోలు శక్తి పెరిగిందన్నారు. అన్ని వస్తువుల ధరలు అందుబాటు ధరల్లోకి వచ్చినట్లు చెప్పారు. ఈ ఆర్థిక వెసులుబాటును ప్రతిఒక్కరికి అందించాలన్నదే ప్రభుత్వాల లక్ష్యమన్న లంకా దినకర్, వ్యాపారులు జిఎస్టీ సంస్కరణల అమలులో నిబంధనలు ఉల్లంఘిస్తే యాంటి ప్రాఫిటింగ్ చట్టం ప్రకారం కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. వస్తుసేవలకు సంబంధించి క్రయవిక్రయాలపై వినియోగదారుల ఫిర్యాదుల కోసం 1915 టోల్‌ఫ్రీ నెంబరును ఏర్పాటుచేసినట్లు చెప్పారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు సూపర్ జిఎస్‌టి సూపర్ సేవింగ్స్‌పై విస్త్రతంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. జిఎస్టీ 2.0 వలన రాష్ట్ర ప్రభుత్వానికి 8వేల కోట్ల వరకు ఆదాయం తగ్గుతున్నా కూడా ప్రజలకు మేలు చేకూర్చేందుకు ఆ నష్టాన్ని భరిస్తూ జిఎస్టీని అమలు చేసేందుకు సీఎం చంద్రబాబునాయుడు ముందుకొచ్చారన్నారు. శాసనసభలో కూడా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన మొదటి సీఎం చంద్రబాబు అని కొనియాడారు. 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటికే సూపర్‌సిక్స్ హామీలను విజయవంతంగా అమలు చేశారని, ఇదే స్ఫూర్తితో జిఎస్టీ ఫలాలు ప్రజలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు లంకా దినకర్ చెప్పారు.
సూపర్ జి ఎస్ టి.. సూపర్ సేవింగ్స్ కరపత్రాలను ఆవిష్కరించారు.
అనంతరం వ్యాపారులు, చార్టెడ్ అకౌంటెంట్లతో జిఎస్టీపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి, జిఎస్‌టి జాయింట్ కమిషనర్ వై కిరణ్‌కుమార్, డిప్యూటీ కమిషనర్ ఎం సత్యప్రకాష్, నెల్లూరు చార్టెడ్ అకౌంట్స్ అసోసియేషన్ చైర్‌పర్సన్ యస్ హిమహాసిని, ట్యాక్స్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విఎంవి సుబ్బారావు, కందుకూరు సత్యనారాయణ, పలువురు వ్యాపారులు, చార్టెడ్ అకౌంటెంట్లు తదితరులు పాల్గొన్నారు.
