*విజ్ఞాన, వినోద యాత్రలు శ్రమించి అలసిన వారికి ఉపశమనం కలిగిస్తుంది*
*పర్యాటక రంగ అభివృద్ధి రాష్ట్రానికి అవసరం*
*పర్యాటక రంగంతో పాటు సాంస్కృతిక కళల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి*
*మన ఆచార వ్యవహారాలు ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్నాయి*
*చిత్తూరు ఎం పి దగ్గుమళ్ళ ప్రసాదరావు*
*ప్రపంచ పర్యాటక దినోత్సవంలో భాగంగా గాంధీ విగ్రహం నుండి మెసానికల్ గ్రౌండ్ వరకు 2 కె రన్ . . జెండా ఊపి ప్రారంభించిన చిత్తూరు ఎంపి*

ప్రజలు, విద్యార్థులు తమ దయనందిన జీవితంలో ప్రతి రోజూ శ్రమించి అలసిపోతారని, వీరిలో విజ్ఞాన, వినోద యాత్రలు నూతన ఉత్సాహం నింపుతాయని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాద రావు పేర్కొన్నారు.
శనివారం ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా గాంధీ విగ్రహం నుండి మెసానికల్ గ్రౌండ్ వరకు 2కె మారథాన్ రన్ ను చిత్తూరు ఎంపి దగ్గుమళ్ళ ప్రసాద్ రావు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మెసానికల్ గ్రౌండ్స్ లో విద్యార్థులతో నిర్వహించిన సభలో ఎంపి ప్రసంగించారు.
ఈ సందర్భంగా చిత్తూరు ఎంపి దగ్గుమళ్ళ ప్రసాదరావు మాట్లాడుతూ విద్యార్థులు తమ చదువుల్లో, పెద్ద వారు వృత్తి, వ్యాపారం పరంగా తీరిక లేని జీవనం గడుపుతూ అలసిపోయి, విసుగెత్తిపోతుంటారని, వీరికి విజ్ఞాన, వినోద యాత్రలు నూతన ఉత్సాహం అందిస్తుందని తెలిపారు. టూరిజం అభివృద్ధి జరిగితే స్థానికంగా ఉపాధి కలుగుతుందని, ప్రజలకు, రాష్ట్రానికి ఆదాయం చేకూరుతుందన్నారు. ప్రపంచంలో స్విట్జర్లాండ్, న్యూజీలాండ్ లాంటి దేశాలతో పాటు మన దేశంలో కాశ్మీర్, కేరళ, గోవా లాంటి రాష్ట్రాలు కూడా పర్యాటక రంగం ద్వారా అధిక శాతం ఆదాయం పొందుతున్నదన్నారు. యాత్రలు చేయడం ద్వారా విద్యార్థులకు తరగతి గదులలో చదువుకున్న పాఠాలతో పాటు మరింత జ్ఞానం పొందవచ్చన్నారు. పర్యాటక శాఖ ద్వారా మన చారిత్రాత్మక కట్టడాలు, ఆలయాలు, తదితరాల గుర్తింపు, పరిరక్షణ, అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక కళల అభివృద్ధి పరిరక్షణలో భాగంగా సెప్టెంబర్ 27న పర్యాటక దినోత్సవంతో పాటు సాంస్కృతిక దినోత్సవంగా గుర్తించిందన్నారు. పండుగలు, ప్రవర్తన సంస్కృతిలో భాగమని, మన ప్రవర్తనను బట్టి సంస్కృతిని అంచనా వేస్తారన్నారు. భారతదేశ సాంస్కృతిక కళలైన భరత నాట్యం, కూచిపూడి, కథకళి లాంటి కళల అభవృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. సంస్కృతి, సాంప్రదాయాలు దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్తాయి..కళాఖండాలకు, చారిత్రాత్మక నిర్మాణాలకు, ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు భారతదేశం అని పేర్కొన్నారు
జిల్లా టూరిజం అధికారి నరేంద్ర మాట్లాడుతూ ప్రపంచంలో పర్యాటక ప్రదేశాల గుర్తింపు, పరిరక్షణ, చారిత్రక కట్టడాల పరిరక్షణ కొరకు ప్రపంచ పర్యాటక సంస్థ సెప్టెంబర్ 27 ను ప్రపంచ పర్యాటక దినోత్సవంగా గుర్తించడం జరిగిందన్నారు. విద్యార్థులు తమ చుట్టు పక్కల ప్రదేశాలలో ప్రముఖ ప్రదేశాలు, ఆలయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం ద్వారా వాటి అభివృద్ధికి తోడ్పడవచ్చన్నారు. పరిశ్రమలతో పాటు పర్యాటక రంగ అభివృద్ధి జరిగితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు.
అనంతరం 2కె రన్, ఎస్ఏ రైటింగ్, వక్తృత్వ పోటీలలలో గెలుపొందిన విద్యార్థులకు ఎంపి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్ అథారిటీ అధికారి బాలాజీ, సమగ్ర శిక్షా ఏపిసి వెంకటరమణా రెడ్డి, ఎస్టేట్ ఎస్సి ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ బాబు, చిత్తూరు పట్టణ సి ఐ మహేశ్వర్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
