పులికాట్ పరిసరాల్లో 10 వేల తాటిచెట్ల పెంపకం
– శ్రీసిటీ-కోబెల్కో ఇండియా 15వ వార్షికోత్సవంలో శ్రీకారం
శ్రీసిటీ, సెప్టెంబర్ 25, 2025:
జపాన్ కు చెందిన కొబెల్కో గ్రూప్ అనుబంధ సంస్థలు కొబె స్టీల్ 120 వ వార్షికోత్సవం మరియు కోబెల్కో కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (KCEI) శ్రీసిటీ ప్లాంట్ 15వ వార్షికోత్సవాన్ని గురువారం తమ శ్రీసిటీ పరిశ్రమ ఆవరణలో వేడుకగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో చెన్నైలోని జపాన్ కాన్సుల్ జనరల్ మునియో తకహషి, కాన్సుల్ నవోకో యుజావా, శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, కోబెల్కో ఆగ్నేయాసియా మేనేజింగ్ డైరెక్టర్ కసమోరి, KCEI మేనేజింగ్ డైరెక్టర్ & CEO హయామా, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని KCEI ఆర్డే ఫౌండేషన్‌తో కలిసి పెద్ద ఎత్తున చెట్ల పెంపకం కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా శ్రీసిటీ మరియు పులికాట్ సరస్సు పరిసరాల్లో 10,000 తాటి మొక్కలను నాటడం లక్ష్యంగా నిర్దేశించుకుంది. వార్షికోత్సవం సందర్భంగా కోబెల్కో ప్రాంగణంలో పలువురు ప్రముఖులు మొక్కలు నాటడంతో దీనిని లాంఛనంగా ప్రారంభించారు. ఈ చొరవ సుస్థిరత, జీవవైవిధ్యం, పర్యావరణం పట్ల కోబెల్కో సంస్థ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.
భారతదేశంలో కోబెల్కో బృందం సాధించిన విజయాలను అభినందిస్తూ ముఖ్య అతిథి మునియో తకహషి వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పారిశ్రామిక వృద్ధి, పర్యావరణ నిర్వహణపై దృష్టి సారిస్తూ ముందుకు సాగుతున్న కంపెనీ ప్రగతి ప్రయాణాన్ని ఆయన ప్రశంసించారు.
కొబెల్కో ప్రగతిలో ఇదో మైలురాయిగా శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి అభివర్ణించారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని చేపట్టిన కంపెనీ సిఎస్సార్ చొరవను, దాని పర్యావరణ దృష్టిని ప్రశంసించారు. శ్రీసిటీలో కేవలం పరిశ్రమలే కాదు, పర్యావరణ వ్యవస్థలను నిర్మిస్తామని ఉద్గాటించారు. చెట్ల పెంపకంపై స్పందిస్తూ, మన నిత్య జీవితంలో తాటి చెట్లకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. ఇది ఆంధ్రుల పాలిట కల్పవృక్షంగా వ్యాఖ్యానించారు. కొబెల్కో మొక్కల నాటే కార్యక్రమం 10 వేల నుంచి లక్షకు విస్తరించేలా తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. శ్రీసిటీలో ఇతర జపనీస్ సంస్థలు కొబెల్కో స్పూర్తితో ఈ తరహా పర్యావరణహిత సిఎస్సార్ చర్యలకు చొరవ చూపాలని కోరారు.
కోబెల్కో ఆగ్నేయాసియా మేనేజింగ్ డైరెక్టర్ కసమోరి మాట్లాడుతూ కొబెల్కో సంస్థకు సంబంధించి 2025 ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. ప్లాంటేషన్ చొరవను కొనియాడుతూ, ఇది ప్రపంచ సహకారం మరియు భాగస్వామ్య బాధ్యతకు సూచికగా నిలుస్తుందన్నారు.
పర్యావరణ కోణంలో తాటి చెట్టు అత్యంత కీలకమైన వృక్ష సంపదగా ఆర్డే ఫౌండేషన్ ట్రస్ట్ జేవియర్ బెనెడిక్ పేర్కొన్నారు. ప్రత్యేకించి వర్షాలు, ఈశాన్య ఋతుపవనాలపై ఇది విశేష సానుకూల ప్రభావం చూపుతుందన్నారు. దేశీయ సంపదైన ఈ మొక్కలను నాటేందుకు అందురూ ముందుకు రావాలని సూచించారు. csr భాగస్వామిగా తనకు ఈ మొక్కలు పెంచేందుకు అవకాశం కల్పించిన కొబెల్కో సంస్థకు, శ్రీసిటీకి ధన్యవాదాలు తెలిపారు.
