మండలాన్ని శాసిస్తున్న భార్యాభర్తలు… చర్యలు తీసుకోవాలంటున్న ప్రజలు

నాగలాపురం సచివాలయంలో ఇటీవల ఆధార్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఆధార్ కరెక్షన్ చేసుకునే వ్యక్తులు నాగలాపురం సచివాలయంలో సంప్రదించాలని అధికారులు ప్రకటించారు. వ్యయ ప్రయాసలకు ఓర్చి 19 పంచాయతీల నుండి వస్తున్న ప్రజలు ఆధార్ సేవల కోసం వెళితే కడివేడు వెల్ఫేర్ అసిస్టెంట్ మాలిక్ ప్రజల నుండి నిర్బంధ వసూలు చేస్తున్నట్లు ప్రజలు కన్నీరు మున్నీరు అవుతున్నారు. మాలిక్ గతంలో బయటకొడియంబేడులో పనిచేస్తూ ప్రజలను నానా ఇబ్బంది పెట్టినట్లు ప్రజలు ఆరోపించారు. అక్కడి నుంచి అతనిని బదిలీ చేశారు. అతని భార్య తస్లీమా నాగలాపురం మూడవ సచివాలయంలో వీఆర్వో గా పని చేస్తున్నారు. వీరిద్దరూ నాగలాపురం మండలం టిపి కోటకు చెందినవారు కావడంతో స్థానికులు అనే ధీమాతో రెచ్చిపోతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రజలు తమ అవసరాలకు ఫోన్ చేస్తే వారు తీయడం లేదని, ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో వీరి అవినీతికి అడ్డే లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. కార్యాలయానికి వెళ్లే ప్రజలతో మర్యాదపూర్వకంగా మసులుకోవడం లేదని చర్చించుకుంటున్నారు. ఆధార్ కార్డు కరెక్షన్ కు 100 రూపాయలు ఫీజు చెల్లిస్తే రసీదు ఇచ్చి అదనంగా మరో వంద రూపాయలు వసూలు చేస్తున్నట్లు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మ్యుటేషన్లలో సైతం భారీగా వసూలు చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. ప్రజాసేవను మరచి అక్రమ సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్న భార్యాభర్తల పై జిల్లాస్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
