
*రానున్న సంవత్సరంలోని పంచాయితీ రాజ్, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలి: ఆం.ప్ర రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని*
తిరుపతి, ఏప్రిల్ 10: రానున్న సంవత్సరంలో పంచాయితీ రాజ్, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాల్సిన ఆవశ్యకత ఉందని, అందు కొరకు ప్రణాళికా బద్ధంగా మాస్టర్ ట్రైనర్ శిక్షణ, మానవ వనరులు, పోలీస్ బలగాలు, ఎలక్టోరల్ రోల్ తదితర అంశాలపై దృష్టి సారించి, ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా స్వేచ్ఛగా వినియోగించుకునేలా ప్రజా స్వామ్య బద్ధంగా ఎన్నికల నిర్వహణ జరిగేలా ఉండాలని ఆం.ప్ర రాష్ర్ట ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని పేర్కొన్నారు.
గురువారం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు రానున్న సంవత్సరం మునిసిపల్ ఎన్నికలు, పంచాయితీ రాజ్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియపై అధికారులకు సూచనలు చేస్తూ, అలాగే అధికారుల సలహాలు సూచనలను కోరుతూ ఆం.ప్ర రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఐఏఎస్ (రిటైర్డ్) గారు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఐఏఎస్ (రిటైర్డ్) తో కలిసి మేథో మథన కార్యక్రమంలో పాల్గొనగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్, జెసి శుభం బన్సల్, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డి ఆర్ ఓ నరసింహులు, పంచాయితీ రాజ్ శాఖ, మునిసిపల్ శాఖ, పోలీస్ శాఖ, రెవెన్యూ తదితర సంబంధిత అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆం.ప్ర సిఈసి కమిషనర్ నీలం సాహ్ని మాట్లాడుతూ రానున్న పంచాయితీ రాజ్, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఈవిఎం ల వినియోగంపై పరిశీలిస్తున్నామని, వాటి సాధ్యా సాధ్యలపై అధికారుల సూచనలు సలహాలను ఆహ్వానిస్తూ చర్చించారు. అంతే కాకుండా మాస్టర్ ట్రైనర్ శిక్షణ, భద్రత బలగాలు, మానవ వనరులు, బడ్జెట్ తదితర అంశాలపై ముందస్తు అంచనాలతో ప్రణాళికలు సిద్ధం కావలసి ఉంటుందని ఆం.ప్ర రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఐఏఎస్ (రిటైర్డ్) తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఐఏఎస్ (రిటైర్డ్) మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అర్హులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకునేలా చూడాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న పంచాయితీ, మునిసిపల్ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధత పై ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వారి సూచనలు ఎంతో విలువైనవి అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి రవి మనోహరాచారి, జిల్లా పంచాయతీ అధికారిని సుశీల దేవి, డిప్యూటీ కమిషనర్ తిరుపతి మున్సిపాలిటీ అమరయ్య తదితరులు పాల్గొన్నారు.
