
*తిరుపతి-పాకాల-కాట్పాడి రైలు మార్గ డబ్లింగ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం*
*కేంద్ర మంత్రికి ధన్యవాదాలు తెలిపిన తిరుపతి ఎంపీ గురుమూర్తి*
తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తన నిరంతర ప్రయత్నాలతో మరో ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం సాదించారు. తిరుపతి-పాకాల-కాట్పాడి రైలు మార్గాన్ని డబుల్ లైన్‌గా అభివృద్ధి చేయడానికి డబ్లింగ్ పనులకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ మొత్తం 104 కిలోమీటర్ల పొడవుతో, దాదాపు రూ.1332 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్రాల్లోని మూడు జిల్లాల్లో ఈ లైన్ విస్తరించబడి ఉంది. ఈ లైన్ నిర్మాణంతో తిరుపతి, శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాలకి ప్రయాణ సమయం తగ్గి, ప్రయాణికులకు సౌలభ్యంగా ఉంటుందని ఎంపీ గురుమూర్తి తెలిపారు. రవాణా సామర్ధ్యం తోపాటుగా వ్యయం కూడా తగ్గుతుందని అన్నారు. ఈ ప్రాజెక్టు ప్రాంతీయ అభివృద్ధిపై గణనీయమైన ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం వద్ద ఆమోదింపజేయడంలో ఎంపీ మద్దిల గురుమూర్తి ప్రత్యేక శ్రద్ద వహించారు. ఆయన గతంలో కేంద్ర రైల్వే మంత్రిని కలిసి విన్నవించడం, రైల్వే శాఖకు సంబంధించిన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ కు కూడా సమస్యను గూర్చి వివరించారు. ఇండియన్ రైల్వే బోర్డు ఛైర్మన్, సిఈఓలతో సమావేశం కావడం ద్వారా ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను వివరించారు. ఇవన్నీ కలిపి కేంద్రం నుండి ఆమోదం రాకడానికి కీలకంగా నిలిచాయి. ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ లభించిన నేపథ్యంలో ఎంపీ గురుమూర్తి కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర రైల్వే మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
