
*వేంకట పాలెంలో శ్రీనివాస కళ్యాణోత్సవం వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన టిటిడి ఈవో*
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మార్చి 15న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణం, వేంకట పాలెంలో జరుగనున్న శ్రీనివాస కల్యాణోత్సవంకు సంబంధించిన వాల్ పోస్టర్ ను టిటిడి ఈవో జె శ్యామల రావు టిటిడి మరియు గుంటూరు జిల్లా అధికారులతో కలిసి శుక్రవారం ఆవిష్కరించారు.
వేంకట పాలెంలో జరుగనున్న శ్రీనివాస కళ్యాణోత్సవంకు సంబంధించి అమరావతి పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నట్లు ఈవో తెలిపారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. తిరుమలలో శ్రీవారి కళ్యాణాన్ని వీక్షించలేని భక్తులకు ఇది అపూర్వమైన అవకాశం అని మాట్లాడారు. అమరావతి పరిసర ప్రాంతాల్లోని భక్తులు వేంకట పాలెంలో జరుగనున్న శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని వీక్షించి స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ, జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్, టిటిడి జేఈవో వి వీరబ్రహ్మం, టిటిడి సిఈ సత్యనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు.

