
*రావణ బ్రహ్మ పై శ్రీ వాల్మీకేశ్వర స్వామి దివ్య దర్శనం*
✍️ *ఉదయం భక్తి ప్రపత్తులతో త్రిశూల స్నానం*
✍️ *ఉభయదారుగా ఎస్.మంజుల ఉమాపతి కుటుంబం*
✍️ *సాయంత్రం ద్వజావరోహనంతో శివరాత్రి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి*
✍️ *ఉభయదారులుగా శ్రీసిటీ ఎండీ రవిసన్నా రెడ్డి కుటుంబం*
నాగలాపురం మండలం సురుటుపల్లి లో శ్రీ సర్వమంగళ సమేత పల్లికొండేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం సాయంత్రం శ్రీ వాల్మీకేశ్వర స్వామి రావణ బ్రహ్మ పై దివ్య సంచారం చేస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.
గత పది రోజులుగా సురుటుపల్లి లోని శ్రీ సర్వ మంగళ సమేత శ్రీ పల్లి కొండే శ్వరాలయంలో శైవాఘమోక్తంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
చివరి రోజైన శుక్రవారం ఉదయం 5 గంటలకు యాగశాల పూజ, 7 గంటలకు శ్రీ శివగామి సమేత నటరాజ స్వామి ఉత్సవ మూర్తులకు అభిషేకం, 9 గంటలకు శ్రీ శివగామి సమేత నటరాజ స్వామి ప్రాకారోత్సవం, 10.15 గంటలకు త్రిశూల స్నానం, 11 గంటలకు ఉత్సవమూర్తికి అభిషేకం, తదుపరి పూర్ణాహుతి, కలశాభిషేకం, దీపారాధన ఆలయ ప్రధాన అర్చకులు కార్తికేయ గురుక్కల్ ఆధ్వర్యంలో అర్చకుల వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు నడుమ సాంప్రదాయ బద్ధంగా నిర్వహించారు.
త్రిశూల స్నానం ఉభయడారుగా మాదనపాలెం, శ్రీసిటీకి చెందిన ఎస్.మంజుల ఉమాపతి కుటుంబ సభ్యులు వ్యవహరించారు.
ఈ సందర్భంగా ఆలయంలో స్వయంభు వెలసిన శ్రీ వాల్మీకేశ్వర స్వామికి, శ్రీ మరగదాంబిగా అమ్మవారికి, శ్రీ దాంపత్య దక్షిణామూర్తి కి, శ్రీ పల్లి కొండేశ్వర స్వామి వార్లకు ప్రత్యేక ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించి సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
సాయంత్రం 4 గంటలకు శాంతి హోమం, ద్వజావరోహనం, తదుపరి ఆచార్యోత్సవం నిర్వహించారు.
సాయంత్రం 7 గంటలకు రావణ బ్రహ్మ వాహనంపై శ్రీ వాల్మీకేశ్వర స్వామిని, పల్లకి వాహనంలో శ్రీ మరకతాంబిగా అమ్మవారిని అధీష్టించి పరిమళాలు వెదజల్లే పుష్పాలు, స్వర్ణ ఖచిత ఆభరణాలతో అందంగా అలంకరించి విశేష పూజలు చేసి, వివిధ రకాల హారతులు సమర్పించారు.
రాత్రి గంటలకు వేదమంత్రోత్సరణలు, మంగళ వాయిద్యాలు, కోలాట భజనలు భాణాసంచా శబ్దాల నడుమ సురుటపల్లి గ్రామంలో రావణ బ్రహ్మ వాహనంలో స్వామి, అమ్మవార్లు దివ్య సంచారం చేస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. దీంతో ఆలయంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి అయ్యాయి.
ఈ ఊరేగింపులో భక్తులు కొబ్బరికాయలు కొట్టి, కర్పూర హారతులతో నీరాజనాలు పలికారు.
రావణ బ్రహ్మ వాహనసేవ ఉభయదారుగా శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నా రెడ్డి కుటుంబ సభ్యులు వ్యవహరించారు.
గ్రామోత్సవంలో కోలాట భజనలు, ఆలయ మండపంలో చిన్నారుల భరతనాట్యం ప్రదర్శన భక్తులను ఆకట్టుకంటుంది.
ఆలయంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని మిరుమిట్లు గొలిపే విద్యుద్దీపాలంకరణలు, దేవతామూర్తుల విద్యుత్ కటౌట్ లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
శివరాత్రి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను ఆలయ ఈఓ లత, సిబ్బంది పర్యవేక్షించారు.
*ఆలయంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవం దిగ్విజయం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ఈఓ లత కృతజ్ఞతలు తెలిపారు.*

