
*జవహర్ నవోదయ విద్యాలయ స్థాపనకు ఎంపీ గురుమూర్తి విజ్ఞప్తి*
తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాటు అవసరాన్ని గుర్తించిన తిరుపతి ఎంపీ డా.మద్దిల గురుమూర్తి ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. డిల్లీలోని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన పాఠశాల విధ్యా విభాగ కార్యదర్శి, విధ్యా సంస్థలు, శిక్షణ బ్యూరో సంయుక్త కార్యదర్శులను ఎంపీ కలిశారు. జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాటు చేయడం ద్వారా గ్రామీణ, పేదరికంలో ఉన్న విద్యార్థులకు ఉన్నతమైన విద్య అందించడమే కాకుండా, ఇలాంటి విద్యా సంస్థలు దేశ అభివృద్ధిలో కీలకమైనవి అని ఆయన తెలిపారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం ప్రస్తుతం ఐఐటీ, ఐజర్ తోపాటు పలు ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలు ఉన్న విద్యా, పరిశోధనా కేంద్రంగా మారిందని అన్నారు. అయినప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులో లేదని వారికి వివరించారు. ఈ గ్యాప్‌ను పూరించేందుకు తిరుపతిలో జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పడితే, గ్రామీణ విద్యార్థుల కోసం అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. జనాభా పెరుగుదల, విద్యార్థుల అవసరాలు, ఈ ప్రాంతంలో ఉన్న మెరుగైన విద్యా మౌళిక సదుపాయాలు దృష్టిలో ఉంచుకుని తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో జవహర్ నవోదయ విద్యాలయాన్ని తక్షణమే స్థాపించాలని ఎంపీ మద్దిల గురుమూర్తి విజ్ఞప్తి చేశారు.

