
*ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో అవసరమైన మరమ్మత్తుల నిధులకు సంబంధించిన అంచనాలు శనివారం లోపు పంపండి: జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్*
తిరుపతి, ఫిబ్రవరి12: వసతి గృహాల మరమ్మత్తులకు సంబంధించిన అంచనాల ప్రతిపాదనలు శనివారం లోపు పూర్తి స్థాయిలో పంపాలని, శాఖాపరమైన నిధులకు అదనంగా అవసరమైన నిధులను సిఎస్ఆర్, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్, ఎంపీ లాడ్స్ తదితర వాటిని వినియోగిస్తున్నామని, అవసరమైన మరమ్మత్తుల మేరకు అంచనాలు తయారు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ ఆదేశించారు.
బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ నుండి సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో, అలాగే మహాత్మా జ్యోతీ రావు పూలే, డా.బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలల సమన్వయ కర్తలతో, ఇంజినీరింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ సమీక్షా సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో కనీస అవసర మరమ్మత్తులను త్వరితగతిన సంబంధిత శాఖ అధిపతులు గుర్తించి వాటికి అవసరమైన నిధులకు సంబంధించిన అంచనాలను సిద్ధం చేసి రానున్న శనివారం నాటికి పరిపాలన అనుమతులకు సమర్పించాలని ఆదేశించారు. శాఖాపరమైన నిధులకు అదనంగా అవసరమైన నిధులను పలు మార్గాల ద్వారా సిఎస్ఆర్, ఎంపీ లాడ్స్, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ( డిఎంఎఫ్) సమీకరించి మరమ్మత్తులు చేపడుతున్నామని, అవసరమైన మరమ్మత్తులు మరుగుదొడ్లు రిపేరీ, రన్నింగ్ వాటర్ ఉండేలా ఏర్పాటు, ప్రతి కొళాయికి ట్యాప్ ఉండేలా, ట్యూబ్ లైట్లు ఏర్పాటు, ఎలక్ట్రికల్ వైరింగ్, ఎల్ఈడి బల్బుల ఏర్పాటు, కిటికీలకు దోమల మెష్, అన్ని గదులకు తలుపులు, గదులలో లీకేజ్ లేకుండా మరమ్మత్తులు, ఫ్లోరింగ్ మరమ్మత్తులు, ఆర్వో త్రాగు నీటి ప్లాంట్ వంటి ఏర్పాటుకు అంచనాల ప్రతిపాదనలు పూర్తి స్థాయిలో ఉండాలని సూచించారు. సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ మరమ్మతుల కొరకు APEWIDC ఇంజినీరింగ్ అధికారులు నిధులను సకాలంలో సద్వినియోగం చేసి పనులు నాణ్యతగా చేపట్టాలని, ఏదైనా పొరపాట్లు చేస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయని అధికారులను హెచ్చరించారు. మరుసటి సమీక్ష సోమవారం నాడు ఉంటుందని కలెక్టర్ తెలిపారు.
ఈ టెలీకాన్ఫరెన్స్ నందు జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి విక్రమ్ కుమార్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏపీ ఈడబ్ల్యుఐడీసీ బాల సుబ్రమణ్యం రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి చంద్రశేఖర్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి సూర్యనారాయణ, మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల జిల్లా సమన్వయకర్త రేష్మ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలల జిల్లా సమన్వయకర్త గీత, సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

