
ఫిబ్రవరి 11 నుంచి పులివెందుల శ్రీ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు
-శ్రీ రంగనాథ స్వామి గ్రూప్ అఫ్ టెంపుల్స్ చైర్మన్ చింతకుంట సుధీకర్ రెడ్డి
(పులివెందుల)
భారతదేశంలో మధ్యరంగ క్షే త్రంగా ప్రసిద్ధి చెందిన శ్రీ పులివెందుల శ్రీరంగనాథ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసినట్లు శ్రీ రంగనాథ స్వామి గ్రూప్ అఫ్ టెంపుల్స్ చైర్మన్ చింతకుంట సుధీకర్ రెడ్డి ఆలయ ఈవో కె.వి.రమణలు పేర్కొన్నారు. ఈ బ్రహ్మోత్సవాలలో ప్రధానంగా ఫిబ్రవరి 14వ తేదీన హనుమద్ వాహన సేవ, 15వ తేదీన గరుడ వాహన సేవ, 16వ తేదీన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి కళ్యాణం 17వ తేదీన బ్రహ్మరథోత్సవ కార్యక్రమాలు ఉంటాయని వారు వెల్లడించారు. ఫిబ్రవరి 11వ తేదీన బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిర్వహిస్తారని అనంతరం అదే రోజు ఉదయం 9 గంటల నుంచి సూర్యప్రభ వాహనంపై, సాయంత్రం 6 గంటలకు చంద్రప్రభ వాహనంపై శ్రీరంగనాథ స్వామి వారి గ్రామోత్సవం నిర్వహిస్తారన్నారు. 12వ తేదీన సింహ వాహన సేవ ,13వ తేదీన చేసే వాహన సేవ ,18వ తేదీన అశ్వవాహన సేవ, 19వ తేదీన హంస వాహన సేవా కార్యక్రమాలు ఉంటాయన్నారు. 17వ తేదీన రాత్రి ముత్యాల పందిరి వాహనంపై స్వామివారు ఊరేగింపు ఉంటుందన్నారు.
.*బ్రహ్మోత్సవాలలో సాంస్కృతిక కార్యక్రమాలు.*
శ్రీ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా దేవస్థానం ఆధ్వర్యంలో 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకు రాత్రి 8 గంటల నుంచి పూలంగళ్ల సర్కిల్ వద్ద ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు వారు వివరించారు. 11వ తేదీన శ్రీ పడమటి వీరాంజనేయ స్వామి దేవస్థానం బృందం వారిచే తాళం భజన కార్యక్రమం ఉంటుంది. 12వ తేదీన నులిగొమ్మ శ్రీధర్ శర్మ గారిచే భక్తి గీతాల ఆలాపన కార్యక్రమం అనంతరం ప్రమీల భాగవతారిణి వారిచే హరికథ కాలక్షేపం ఉంటుంది. 13వ తేదీన శ్రీ యువ రాజా కళానిలయం చిన్నారులచే సాంస్కృతిక కార్యక్రమాలు, 14వ తేదీన గాలివీడు డాక్టర్ నాగేశ్వరరావు బృందం వారిచే సాసవల చిన్నమ్మ కథ ఉంటాయి. 15వ తేదీన ఎక్సలెంట్ నాగార్జున స్కూల్ పులివెందుల విద్యార్థులచే డాన్స్ మాస్టర్ సురేష్ ఆధ్వర్యంలో నృత్య ప్రదర్శన కార్యక్రమాలు ఉంటాయి. 16వ తేదీన పులివెందుల రాజా కళానిలయం చిన్నారులచే సాoస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. బ్రహ్మ రథోత్సవం 17వ తేదీన ఉదయం నాగయ్య బృందం వారిచే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి వేషధారణ నృత్యాలు, గురువులు అంకన్న అమర్నాథ్ బృందం చే చెక్కభజన కార్యక్రమం ఉంటుంది. 18వ తేదీన శివ జ్యోతి నాటక కళానికేతన్ వారికి నవరత్నాలు డ్రామా ప్రదర్శిస్తారు. 19వ తేదీన శ్రీ వాల్మీకి నాట్యమండలి పులివెందుల వారిచే సత్య హరిచంద్ర పూర్తి నాటకం ప్రదర్శిస్తారు. బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని వారు పిలుపునిచ్చారు.

