Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

తిరుమలలో వైభవంగా రథసప్తమి

పత్రికా ప్రకటన

తిరుమల, 2025 ఫిబ్రవరి 04

సూర్యప్రభవాహనంపై శ్రీ మన్నారాయణుడి అభయం

తిరుమలలో వైభవంగా రథసప్తమి

సూర్య జయంతిని పురస్కరించుకుని మంగళవారంనాడు తిరుమలలో రథసప్తమి ఉత్సవాన్ని టీటీడీ వైభవంగా నిర్వహించింది.

ప్రతి ఏటా మాఘ శుద్ధ సప్తమినాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఒకే రోజున శ్రీమలయప్ప స్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై అనుగ్రహించడం విశేషం. ఈ కారణంగా ఈ ఉత్సవాన్ని అర్ధ బ్రహ్మోత్సవం, మినీ బ్రహ్మోత్సవం, ఒకరోజు బ్రహ్మోత్సవంగా పిలుస్తుంటారు.

రథసప్తమి పర్వదినాన్ని తిరుమలలో క్రీ.శ 1564 నుండి జరుపుతున్నట్లుగా శాసనాధారాలు ఉన్నాయి. సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు వివిధ వాహనాలపై స్వామివారిని వేంచేపు చేస్తారు.

సూర్యప్రభ వాహనం – (ఉదయం 5.30 నుండి 8 గంటల వరకు) :

అత్యంత ప్రధానమైన రథసప్తమి వాహనసేవ సూర్యప్రభవాహనం. సర్వలోకాలకు చైతన్యాన్ని కలిగిస్తూ ఉదయించే శ్రీ సూర్య భగవానుడు తన ఉషారేఖలను ఉదయం 6.48 గంటలకు శ్రీవారి పాదాలపై ప్రసరించి అంజలి ఘటించాడు. ఈ వాహనసేవ అపురూప దృశ్యాన్ని తిలకించేందుకు ఉదయాత్పూర్వం నుండి ఎంతో ఆసక్తితో నిరీక్షిస్తున్న వేలాది మంది భక్తిపారవశ్యంతో పులకించారు. భక్తుల గోవిందనామస్మరణ మధ్య స్వామివారి వాహనసేవ వైభవంగా జరిగింది.

ఆయురారోగ్య‌ప్రాప్తి :

సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నాడు. ఈ వాహ‌నంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్య ప్రభ. సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యుని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.

ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ శ్రీ బి.ఆర్ నాయుడు, పాలక మండలి సభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ, శ్రీ ఎమ్మెస్ రాజు, శ్రీమతి పనబాక లక్ష్మి, శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, శ్రీ భాను ప్రకాష్ రెడ్డి, శ్రీ ఎన్. సదాశివరావు, శ్రీ నరేష్ పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Related posts

తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణ: ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్:*

Garuda Telugu News

శ్రీ మహాలక్ష్మిగా మరగదాంబిగా అమ్మవారు దివ్యదర్శనం

Garuda Telugu News

శ్రీకాళహస్తి: స్వామివారి సేవలో సినీనటులు జీవిత రాజశేఖర్

Garuda Telugu News

Leave a Comment