Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

గోవిందునికి అరుదైన విరాళం

పత్రికా ప్రకటన

తిరుమల, 2025 ఫిబ్రవరి 03

 

గోవిందునికి అరుదైన విరాళం

 

వెంకన్నకు కానుకగా ఆదా చేసిన ప్రతి పైసా

 

ఎస్వీ సర్వ శ్రేయాస్ ట్రస్ట్‌కు రూ.50 లక్షలు విరాళం

 

దాత శ్రీమతి మోహనను అభినందించిన టీటీడీ అదనపు ఈవో

 

ఏడుకొండల్లో కొలువైన వెంకన్నకు ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. వారు టీటీడీకి చెందిన వివిధ ట్రస్టులు, పథకాలకు విరాళాలు ఇస్తారు. అలాగే పేదల కోసం టీటీడీ నిర్వహించే దాతృత్వ కార్యకలాపాలల్లోనూ భాగస్వాములుగా ఉంటారు. అయితే సోమవారం శ్రీవారికి అందిన విరాళం చాలా అరుదైనదిగా నిలిచిపోయింది. భారత్ సహా పలు దేశాల్లో విపత్తు అధికారిగా సేవలు అందించిన ఓ మహిళ, తన జీవితంలో ఆదా చేసిన ప్రతి పైసాను వెంకన్నకు కానుకగా సమర్పించారు. టీటీడీ విద్యా సంస్థల్లో చదువుతున్న అనాథ, పేద పిల్లల సంక్షేమం కోసం ఈ విరాళాన్ని వినియోగించనున్నారు.

రేణిగుంటకు చెందిన శ్రీమతి సి.మోహన భారతదేశంతో పాటు కాసావో, అల్బేనియా, యెమెన్, సౌదీ అరేబియాలలో అభివృద్ధి – విపత్తు నిర్వహణ రంగాలలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఉద్యోగరీత్యా ఆమె ఎక్కడ పనిచేస్తున్నా, గోవిందుని నామస్మరణను మాత్రం మర్చిపోలేదు. అంతేకాదు, తన వృత్తిజీవితంలో ఆదా చేసిన ప్రతి రూపాయిని శ్రీవారికి కానుకగా ఇవ్వాలని నిర్ణయించారు. ఆ విధంగా ఆదా చేసిన రూ.50 లక్షలను టీటీడీకి చెందిన శ్రీ వెంకటేశ్వర సర్వ శ్రేయాస్(ఎస్వీ బాలమందిర్) ట్రస్ట్‌కు ఇచ్చారు. ఆ మొత్తాన్ని డీడీ రూపంలో తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్.వెంకయ్య చౌదరికి అప్పగించారు. ఆమె దాతృత్వాన్ని వెంకయ్య చౌదరి కొనియాడారు. మూడున్నర దశాబ్దాలకుపైగా తన వృత్తి జీవితంలో సంపాదించిన ధనాన్ని, గోవిందుడి కృపతో అనాథలు, పేదలకు ఉపయోగపడాలనే ఆమె నిర్ణయం ప్రశంసనీయమని అన్నారు.

సునామీ విధ్వంసం సమయంలో శ్రీమతి మోహన ధైర్యసాహసాలతో తన సేవలు అందించారు. 1982-94 మధ్య పలు దేశాలలో అనేక భూకంపాలు, తుఫానులు కలిగించిన కష్టాల్లో కూడా ఐక్యరాజ్యసమితి, అమెరికా, బ్రిటిష్ ఛారిటీలతో కలిసి పనిచేసి ప్రజలకు తన వంతు సాయం అందించారు. ఇప్పుడు కూడా శ్రీవారి ద్వారా పేద ప్రజలకు తన సంపాదన ఉపయోగపడాలని భావించి, అరుదైన విరాళాన్ని అందించారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 

Related posts

ఓలూరు రాయల చెరువు తెగిపోవడం వల్ల కలత్తూరు, కలత్తూరు హరిజనవాడ, పాతపాలెం గ్రామాలు తీవ్రంగా ప్రభావితమైన విషయం తెలిసిందే

Garuda Telugu News

ఆలయ కుంభాభిషేకం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పులివర్తి నాని గారు.

Garuda Telugu News

*ఏపీలో ఉచిత బస్సు.. ఉగాదికి ఫిక్స్!

Garuda Telugu News

Leave a Comment