హోం మంత్రి అమిత్ షా తక్షణం తన పదవికి రాజీనామా చేయాలి
సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ తిరుపతి జిల్లా కార్యదర్శి రాయపునేని హరికృష్ణ డిమాండ్
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై రాజ్యసభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆ పదవికి అనర్హులని తక్షణం తన పదవికి ఆయన రాజీనామా చేయాలని సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ తిరుపతి జిల్లా కార్యదర్శి రాయపనేని హరికృష్ణ డిమాండ్ చేశారు. అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా దేశంలోని అన్ని వామపక్ష పార్టీలు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా సోమవారం తిరుపతిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ, సిపిఐ, సిపిఎం, ఎస్ యు సి ఐ (సి) పార్టీల సమీక్ష ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కమ్యూనిస్టు పార్టీల నేతలు అమిత్ షాకు వ్యతిరేకంగా బిజెపి తీరును నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాయపనేని హరికృష్ణ మాట్లాడుతూ భారత రాజ్యాంగం పట్ల, దాన్ని రూపొందించిన మే ధావి అంబేద్కర్ పట్ల ఏమాత్రం గౌరవం లేదని అన్నారు. భారతదేశంలో కుల, మత, వర్గ, వర్ణ, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి విద్యా, వైద్యం, ఉద్యోగాలు, ఇతర హక్కులన్నీ సమానంగా అందించిన మహానుభావుడు అంబేద్కర్ అని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాలు, మేధావులు, ప్రజాస్వామికవాదులు అంబేద్కర్ను మానవతావాదిగా, మహోన్నతుడిగా ఆరాధిస్తున్నారని చెప్పారు. మనుధర్మ శాస్త్రాన్ని నెత్తికెత్తుకున్న బిజెపి, ఆర్ఎస్ఎస్ పార్టీలు తమ రాజ్యాంగాన్ని దేశంలో అమలు చేయడానికి కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే ఎన్నికలంటే తమ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను అమలు చేయడానికి సిద్ధమవుతున్న తీరు ప్రజలు గుర్తించాలన్నారు. దీని వెనుక దేశంలో ప్రజాస్వామ్యానికి, లౌకిక వాదానికి పెనుముప్పు పొంచి ఉందని చెప్పారు. ఈ దేశంలో మతోన్మాదుల ఆటలు సాగకపోవడానికి వామపక్ష పార్టీలు బలంగా ఉండటమే కారణమన్నారు. సిపిఐ రాష్ట్ర నాయకులు రామానాయుడు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను అవమానించడం అంటే రాజ్యాంగాన్ని కూడా అవమానించడమే అన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించలేని వ్యక్తి ఆ పదవిలో ఉండటానికి అర్హులని తక్షణం అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ బిజెపి దేశంలో హిందు నినాదంతో ఏకపక్షంగా వ్యవహరిస్తూ మతోన్మాదాన్ని పెంచి పోషిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. బిజెపి మతోన్మాద చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. అంబేద్కర్ను అవమానించిన అమిత్ షా తక్షణం రాజీనామా చేయాలని అంతవరకూ తమ పోరాటం ఆగదన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ తిరుపతి నగర కార్యదర్శి పి వెంకటరత్నం, నాయకులు లోకేష్, వెంకటసుబ్బయ్య, ముని కుమార్, వెంకటేష్, లక్ష్మీ, సిపిఐ నాయకులు రాధాకృష్ణ, ఎన్డి రవి, సిపిఎం నాయకులు జి బి సుబ్రహ్మణ్యం, బుజ్జి, మాధవ్ కృష్ణ, వేణు, సాయి లక్ష్మి, హేమలత, ఎస్తయుసిఐ నాయకులు హరీష్. తదితరులు పాల్గొన్నారు
