*‘ఒక దేశం- ఒకేసారి ఎన్నికలు’ లక్ష్యంతో దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు ప్రవేశపెడుతున్న బిల్లులకు రాష్ట్రాల శాసనసభల ఆమోదం అవసరం లేదని లా కమిషన్.. సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి తెలిపింది*

ప్రతిపాదిత బిల్లులు రాజ్యాంగంలోని మౌలిక స్వరూపాన్ని మార్చేందుకు ఏమీ ప్రయత్నించడం లేదని పేర్కొంది. సమాఖ్య నిర్మాణానికి భంగకరమయ్యేలా రాజ్యాంగ నిబంధనల్నీ మార్చడం లేదని స్పష్టం చేసింది. ఈ బిల్లులకు సంబంధించి ఇప్పటికే పలు వర్గాలతో చర్చించిన జేపీసీ.. గురువారం లా కమిషన్‌తో కూడా విస్తృత చర్చలు జరిపింది.
మరో రెండు నెలల్లో మరింత మంది నిపుణులు, సంస్థలతో చర్చలు జరిపిన తర్వాత నివేదికను రూపొందించి వచ్చే బడ్జెట్ సమావేశాలలోపు సమర్పించనుంది. ఈ నివేదికను బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. కాగా, రాజ్యాంగంలోని 368వ అధికరణ కింద జమిలి ఎన్నికల నిర్వహణకు రాష్ట్రాల ఆమోదం అవసరం లేదని 23వ లా కమిషన్ చైర్మన్ జస్టిస్ దినేశ్ మహేశ్వరి.. జేపీసీ సభ్యులకు వివరించారు.
