శ్రీసిటీకి ఇద్దరు ప్రత్యేక అధికారుల నియామకం
– పారిశ్రామిక సేవల బలోపేతం దిశగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం

శ్రీసిటీ, నవంబర్ 26, 2025:
పరిశ్రమలకు అనుకూల వాతావరణం, ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ మరియు ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ కార్యక్రమాలను మరింత బలోపేతం చేస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీసిటీకి ఇద్దరు ప్రత్యేక అధికారులను నియమించింది. దీంతో పెట్టుబడిదారులకు అవసరమైన అనుమతులు, సేవలు అన్ని ఒకే చోట అందించే ‘వన్-స్టాప్ అడ్మినిస్ట్రేషన్’ అమల్లోకి వచ్చింది.తిరుపతిలోని జిల్లా పరిశ్రమల కేంద్రం (DIC) ఇండస్ట్రియల్ ప్రమోషన్ అధికారి వి. జయంత్ కుమార్‌ను శ్రీసిటీ ఫెసిలిటేషన్ ఆఫీసర్‌గా నియమించారు. పరిశ్రమల అనుమతులు, ప్రోత్సాహకాల ప్రక్రియలు, వ్యాపార సంస్కరణల అమలు వంటి కీలక సేవల కోసం ఆయన పనిచేయనున్నారు. ప్రతి మంగళవారం, శుక్రవారం శ్రీసిటీలో ఆయన ప్రత్యక్షంగా అందుబాటులో ఉంటారు. పరిశ్రమల శాఖ, శ్రీసిటీ యాజమాన్యం, కంపెనీల మధ్య ప్రధాన అనుసంధాన అధికారిగా వ్యవహరిస్తారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సకాలంలో ఫిర్యాదుల పరిష్కారం, సమన్వయంతో పాటు సమస్యలను సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో సహకారం అందిస్తారు. పరిశ్రమలకు అవసరమైన సేవలు మరింత వేగంగా, సమర్థవంతంగా అందేలా చేస్తారు.అలాగే APIIC ప్రాజెక్టు ఇంజనీర్ (సివిల్) సుగుణను శ్రీసిటీ ఐలా అధికారిగా నియమించారు. భవన అనుమతుల ఆన్‌లైన్ ప్రాసెసింగ్, ప్రాపర్టీ టాక్స్ నిర్వహణ, వివిధ శాఖలతో సమన్వయం ద్వారా ఆన్‌లైన్ సేవల పరిష్కారం తదితర విధులను ఆమె నిర్వహిస్తారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ మార్గదర్శకాల మేరకు సేవలను పారదర్శకంగా, సమయానుకూలంగా, సమర్థవంతంగా అందించడానికి కృషి చేస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమర్థ నాయకత్వాన్ని ప్రశంసించిన శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, శ్రీసిటీలో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ‘వన్-స్టాప్ అడ్మినిస్ట్రేషన్’ అమలు చేసినందుకు సమాచార సాంకేతిక ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ కి, పరిశ్రమలు, వాణిజ్యం & ఆహార శుద్ధి మంత్రి టి.జి.భరత్ కు, మరియు ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక అధికారులను నియామకం వల్ల అనుమతుల మంజూరు ప్రక్రియ వేగవంతమవుతుందని, విభాగాల మధ్య సమన్వయం మెరుగవుతుందని, పరిశ్రమలకు మరింత సహకారం అందుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ చర్య ముఖ్యమంత్రి దార్శినిక పాలనకు, రాష్ట్రం అమలు చేస్తున్న ‘ఈజ్ అండ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ సూత్రానికి నిజమైన ప్రతిబింబమని అన్నారు.ముఖ్యమంత్రి వ్యవహార శైలి, పరిశ్రమల అభివృద్ధిపై ఆయన చిత్తశుద్ధి గురించి ప్రస్తావించిన డా. సన్నారెడ్డి, గతంలో పలు పర్యాయాలు శ్రీసిటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనలు, పరిశ్రమలను ప్రోత్సహిస్తూ ఆయన తీసుకున్న పలు నిర్ణయాలను గుర్తుచేశారు. కెలాగ్స్ కంపెనీలో మహిళలకు నైట్ షిఫ్ట్‌లో పని చేసేందుకు అనుమతి, JETRO ప్రతినిధుల విజ్ఞప్తిపై ప్రత్యేక అగ్నిమాపక కేంద్రం మంజూరు, డీఎస్పీ స్థాయిలో హైటెక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు, శ్రీసిటీ అభివృద్ధి కోసం ఐలా (IALA) అధికారాలను విస్తరించడం వంటి వేగవంతమైన, మార్గదర్శక నిర్ణయాలు ముఖ్యమంత్రి దార్శినిక, పరిశ్రమల అనుకూల పాలనకు నిదర్శనాలని ఆయన పేర్కొన్నారు.
విశాఖ సదస్సు 2025లో రాష్ట్రానికి వచ్చిన అంతర్జాతీయ గుర్తింపు, పెద్దఎత్తున పెట్టుబడుల ప్రతిపాదనలు ముఖ్యమంత్రి దూరదృష్టి, నాయకత్వానికి ప్రతీకగా అభివర్ణించిన డా. సన్నారెడ్డి, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రోత్సాహకాలను విడుదల చేయడం ద్వారా ప్రభుత్వం పెట్టుబడిదారుల అనుకూల వాతావరణాన్ని మరింత బలపరిచిందని అభిప్రాయపడ్డారు.
