నాయి బ్రాహ్మణ కులవృత్తికి పేటెంట్ హక్కు కల్పించాలి…
… కార్పొరేట్ సెలూన్ షాపులను ప్రభుత్వం రద్దు చేయాలి…
కులదూషణపై ప్రత్యేక జీవోను వెంటనే అమలు చేయాలి…
రాయలసీమ నాయి బ్రాహ్మణ ఐక్యవేదిక తీర్మానం…
తిరుపతి, నవంబర్ 18:

నాయి బ్రాహ్మణుల కులవృత్తికి రాష్ట్ర ప్రభుత్వం శాశ్వతంగా పేటెంట్ హక్కు కల్పించాలని, రాష్ట్రంలో ఉన్న కార్పొరేట్ సెలూన్ షాపులను వెంటనే రద్దు చేసేలా ప్రభుత్వం చొరవ చూపాలని రాయలసీమ నాయి బ్రాహ్మణ ఐక్యవేదిక సమావేశంలో నాయి బ్రాహ్మణులు తీర్మానించారు. మంగళవారం తిరుపతిలోని యూత్ హాస్టల్లో తిరుపతి నగర నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో రాయలసీమ నాయి బ్రాహ్మణ ఐక్యవేదిక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర కన్వీనర్ సిబ్యాల సుధాకర్ అధ్యక్షతన వహించారు. సమావేశానికి రాయలసీమ లోని ఎనిమిది జిల్లాలకు చెందిన నాయి బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంగలి మహాసభ కన్వీనర్ హరిప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలోని పలు జిల్లాలలో నాయి బ్రాహ్మణులను తక్కువ చేసి కులం పేరుతో దూషణలకు పాల్పడుతున్నారని దీంతో తమకు ఎంతో మనోవేదన కు గురవుతున్నామని చెప్పారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని తమ పట్ల కుల దూషణకు పాల్పడే వారికి కఠినమైన చర్యలు తీసుకునేలా ప్రత్యేక జీవోలను వెంటనే విడుదల చేయాలని కోరారు. బీసీ సంఘాల సమావేశాలకు అన్ని జిల్లాలలో నాయి బ్రాహ్మణ సంఘాలకు చెందిన ప్రతినిధులు కూడా పాల్గొని భాగస్వాములు కావలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. బీసీ ఎస్సీ ఎస్టీల సమావేశాలకు నాయి బ్రాహ్మణ కులం నుంచి తమ ప్రతినిధులు కూడా హాజరైతేనే తమకు కూడా ఒక గుర్తింపు బలము చేకూరే అవకాశం ఉందని చెప్పారు. రాష్ట్ర వాయిద్య కళాకారుల సంఘం గౌరవ అధ్యక్షులు యల మందరావు మాట్లాడుతూ మనమంతా ఐక్యంగా ఉంటేనే ఎలాంటి సమస్యలనైనా పరిష్కరించుకోవచ్చునని, ఐక్యత లేనప్పుడే మనకు ఎలాంటి గుర్తింపు ఉండదని మన సమస్యలు పరిష్కారం కాదని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు తయారవుతుందని చెప్పారు. ఇప్పటికైనా రాయలసీమ జిల్లాలలోని నాయి బ్రాహ్మణులంతా ఏకతాటిపై వచ్చి సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకొని యూనిటీగా ఉన్నప్పుడే రాజకీయ పార్టీలు కూడా మన కులాన్ని గౌరవిస్తాయని చెప్పారు. రాష్ట్ర ధన్వంతరి నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర కన్వీనర్ సిబ్యాల సుధాకర్ మాట్లాడుతూ మనమంతా ఐక్యంగా ఉండి మన రాష్ట్ర రాజధాని అమరావతిలో త్వరలో రాష్ట్ర నూతన కార్యవర్గ ఎన్నిక సమావేశం జరుగుతుందని, ఆ సమావేశానికి పెద్ద ఎత్తున అన్ని జిల్లాల నుంచి నాయి బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు హాజరయ్యేలా చొరవ సుఫాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జనవరి నెలలో అమరావతిలో 5000 మందితో నూతన కార్యవర్గ ఎన్నిక, రాష్ట్ర సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. తిరుపతి నగర నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు సహదేవ జయకుమార్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో మనమంతా ఐక్యతగా ఉన్నప్పుడే మనకు రాజకీయ పార్టీలు కానీ ఇతర ప్రజా సంఘాలు కానీ గుర్తింపునిస్తాయని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది నాయి బ్రాహ్మణులు ఉన్నప్పటికీ రాజకీయంగా గుర్తింపు లేకపోవడం చాలా బాధాకరమన్నారు. కావున కూటమి ప్రభుత్వానికి దృష్టికి నాయి బ్రాహ్మణులకు ఎమ్మెల్సీ గాని, ఎమ్మెల్యే కానీ, నామినేటెడ్ పదవులలో గానీ ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. . సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హసనాపురం నాగభూషణం, రాయలసీమ కన్వీనర్ రాచవిటి రవి కిషోర్, కో కన్వీనర్ తిమ్మసముద్రం దేవా, తిరుపతి జిల్లా యువజన అధ్యక్షులు మంగలి వెంకటేశు, ప్రధాన కార్యదర్శి గడ్డం మల్లికార్జున , అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మహేష్ లు పాల్గొన్నారు.
