*బలపడుతున్న భారత్–జపాన్ పారిశ్రామిక బంధం*

– *దేశంలో రెండో అతిపెద్ద జపనీస్ ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌గా శ్రీసిటీ*♦️
–
– *సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ శ్రీసిటీ ఎండీ*🔖
శ్రీసిటీ, నవంబర్ 14, 2025:
భారతదేశ ఆర్థికాభివృద్ధిలో జపాన్ సంస్థల పెట్టుబడులు విస్తరిస్తూ భారత్–జపాన్ పారిశ్రామిక బంధం మరింత బలపడుతోందని, ఇందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం విశాఖపట్నంలో జరిగిన 30వ సీఐఐ పెట్టుబడుల భాగస్వామ్య సదస్సులో ‘భారత్–జపాన్ భాగస్వామ్యం’ సెషన్‌లో ఆయన ప్యానెలిస్ట్‌గా పాల్గొన్నారు. JCCIC చెన్నై ప్రెసిడెంట్ అకిరా హాంజావా, జెట్రో చెన్నై డైరెక్టర్ జనరల్ కౌరు షిరయిషి, ఇతర ప్యానెలిస్ట్‌లుగా పాల్గొనగా, CII జాతీయ కమిటీ చైర్మన్ మరియు రాక్‌వెల్ ఆటోమేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ సాహ్నీ సెషన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్యం, ఆహారశుద్ధి శాఖ మంత్రి టి.జి.భరత్ ముఖ్య అతిథిగా పాల్గొని కీలక ప్రసంగం చేయగా, భారత్ లోని జపాన్ రాయబారి హనరబుల్ ఓనో కేయీచి ప్రత్యేక ప్రసంగం చేశారు.
*డా. రవీంద్రసన్నారెడ్డి మాట్లాడుతూ*-, జపాన్ పెట్టుబడిదారుల అత్యంత ప్రాధాన్య గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ మారిందంటూ, శ్రీసిటీ భారతదేశంలో రెండో అతిపెద్ద జపనీస్ ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌గా ఎదిగిందన్నారు. 300 ఎకరాల్లో ఏర్పాటు చేసిన జపాన్ ఎన్‌క్లేవ్‌లో 35 కు పైగా కంపెనీలు పనిచేస్తున్నాయని తెలిపారు. తద్వారా ₹20,000 కోట్లకు పైగా పెట్టుబడులు, 20,000కు పైగా ప్రత్యక్ష ఉద్యోగాలు సృష్టించబడ్డాయని వెల్లడించారు. ప్రత్యేకంగా రూపొందించిన మౌళిక సదుపాయాలు, రవాణా మార్గాల అనుసంధానం, చెన్నై పారిశ్రామిక కారిడార్ సమీపంలో ఉండడం వంటి అంశాలు శ్రీసిటీని జపాన్ కంపెనీలకు అత్యంత ఆకర్షణీయ గమ్యస్థానంగా మార్చినట్లు వివరించారు. అలాగే, శ్రీసిటీలోని జపాన్–ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాన్యుఫ్యాక్చరింగ్ (JIM) నైపుణ్య కేంద్రం శిక్షణ ద్వారా స్థానిక యువతను జపనీస్ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా తయారుచేస్తోందని చెప్పారు.
చర్చల సమయంలో ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు, శ్రామికశక్తి లభ్యత, భవిష్యత్ విస్తరణపై జపాన్ ప్రతినిధులు ప్రశ్నలు అడగగా, సంపూర్ణ సహాయ సహకారాలు అందించేందుకు శ్రీసిటీ కట్టుబడి ఉందని డాక్టర్ సన్నారెడ్డి సమాధానమిచ్చారు.
*ప్రత్యేక ఆకర్షణగా శ్రీసిటీ స్టాల్..*♦️
సదస్సులో ఏర్పాటు చేసిన శ్రీ సిటీ స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వ్యూహాత్మక స్థానం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను ప్రదర్శించే ఆకర్షణీయ డిజిటల్ ప్రదర్శనలు, 3D మోడళ్లతో పలువురి దృష్టిని ఆకర్షించింది. FMCG వస్తువులు, వివిధ ఎయిర్ కండిషనర్ బ్రాండ్లు, ఆటోమొబైల్ భాగాలు, వీల్‌చైర్లు, ఇసుజు వాహనాలతో సహా “మేడ్ @ శ్రీ సిటీ” ఉత్పత్తుల ప్రదర్శన ప్రతినిధులను ఆకర్షించింది. దీనిని సందర్శించిన దౌత్యవేత్తలు, మంత్రులు, పరిశ్రమల ప్రతినిధులు శ్రీసిటీ విలక్షణమైన సమగ్ర అభివృద్ధి నమూనాను ప్రశంసించారు.
