Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

వైభవంగా శ్రీవారి వసంతోత్సవాలు ప్రారంభం

*వైభవంగా శ్రీవారి వసంతోత్సవాలు ప్రారంభం*

తిరుమలలోని వసంతోత్సవ మండపంలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు గురువారం శోభాయ‌మానంగా ప్రారంభమయ్యాయి.

వసంత ఋతువులో శ్రీ మలయప్పస్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి ‘వసంతోత్సవ’మని పేరు ఏర్పడింది. ఎండ వేడి నుండి స్వామివారు ఉపశమనం పొందేందుకు జరిపే ఉత్సవం కావడంతో దీన్ని ఉపశమనోత్సవం అని కూడా అంటారు. ఈ ఉత్సవంలో సుగంధాన్ని వెదజల్లే పుష్పాలతోపాటు పలురకాల మధురఫలాలను స్వామివారికి నివేదిస్తారు. ఈ వేడుకల కోసం ఆకర్షణీయంగా మండపాన్ని రూపొందించారు.

ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామి వారు నాలుగు మాడవీధుల్లో ఊరేగింపుగా వసంత మండపానికి వేంచేపు చేశారు. ఉదయం ఆస్థానం చేపట్టారు.

*వైభవంగా స్నపనతిరుమంజనం*

వసంతోత్సవాల్లో భాగంగా మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు శ్రీ భూ సమేత మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, నవకలశాభిషేకం, రాజోపచారం నిర్వహించారు. అనంతరం ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా క్షీర(పాలు), దధి(పెరుగు), మది(తేనె), నారికేళం(కొబ్బరినీళ్లు), హరిద్రోదకం(పసుపు), గంధోదకం(గంధం)తో స్నపనం నిర్వహించారు. వీటితో శంఖధార, చక్రధార, సహస్రధార, మహాకుంభాభిషేకాలను వైఖనసాగమోక్తంగా చేపట్టారు. ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, పంచశాంతి మంత్రాలు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే పాశురాలను వేదపండితులు పఠించారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమజాతి పుష్పమాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. ఆ తరువాత స్వామి, అమ్మవార్లు సాయంత్రం అక్కడినుండి బయల్దేరి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు.

*ఏప్రిల్ 11న స్వర్ణరథోత్సవం…*

వసంతోత్సవాల్లో రెండవ రోజైన ఏప్రిల్ 11న ఉదయం 8 నుండి 10 గంటల వరకు శ్రీభూ సమేత శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణరథంపై తిరుమాడ వీధులలో ఊరేగుతారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామి, అదనపు ఈవో శ్రీ సి.హెచ్‌.వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, పేష్కార్ శ్రీ రామ కృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Related posts

కియా పరిశ్రమలో భారీ చోరీ..ఏకంగా 900 కార్ల ఇంజిన్లు మాయం

Garuda Telugu News

పార్టీ కార్యకర్తలకు అండగా మీ జగన్‌ ఉంటాడు

Garuda Telugu News

2025 ఆర్థిక బడ్జెట్ దేశాన్ని స్వావలంబన వైపు నడిపిస్తుంది

Garuda Telugu News

Leave a Comment