Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

సరఫరా గొలుసు స్థిరత్వంలో శ్రీసిటీ కీలక పాత్ర – ఇండియా-జపాన్ వ్యాపార సమావేశంలో శ్రీసిటీ ఎండీ 

సరఫరా గొలుసు స్థిరత్వంలో శ్రీసిటీ కీలక పాత్ర

– ఇండియా-జపాన్ వ్యాపార సమావేశంలో శ్రీసిటీ ఎండీ

 

న్యూఢిల్లీ, మార్చి 06, 2025:

 

న్యూఢిల్లీలోని ఫిక్కీ కార్యాలయంలో జరిగిన 48వ ఇండియా-జపాన్ బిజినెస్ కోఆపరేషన్ కమిటీ (IJBCC) మరియు జపాన్-ఇండియా బిజినెస్ కోఆపరేషన్ కమిటీ (JIBCC) ఉమ్మడి సమావేశంలో శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ప్రసంగించారు. పరిశ్రమ మరియూ ప్రాంతీయాభివృద్ధికి ఇండియా-జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యం‌పై జరిగిన ఈ సమావేశానికి జపాన్ నుంచి ఉన్నతస్థాయి పారిశ్రామిక ప్రతినిధులు హాజరయ్యారు.

 

“భవిష్యత్తు కోసం సుస్థిర సరఫరా గొలుసు వ్యవస్థను నిర్మించడం” అనే ప్లీనరీ సెషన్‌లో మాట్లాడిన డా. రవీంద్ర సన్నారెడ్డి, జపాన్ కంపెనీల సరఫరా గొలుసు స్థిరత్వ ప్రోత్సాహక కార్యక్రమంలో శ్రీసిటీ కీలక పాత్ర పోషిస్తోందని వివరించారు. దేశంలోనే రెండవ అతిపెద్ద జపనీస్ ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌గా, శ్రీసిటీలో ఇప్పటికే ఇసుజు, యూనిచార్మ్, డైకిన్, టీ.హెచ్.కే వంటి 31 జపనీస్ కంపెనీలు, వాటికి విడిభాగాలు సరఫరా చేసే పలు పరిశ్రమలు ఉన్నాయన్నారు. శ్రీసిటీలో ఓ.ఈ.ఎం. కంపెనీలు, టైర్-1 & టైర్-2 విడిభాగాల సరఫరా పరిశ్రమలు ఒకే చోట ఉండటం వలన సమర్థత పెరిగి, ఉత్పత్తి & లాజిస్టిక్స్ మరింత సులభతరం అవుతున్నాయన్నారు. పరిశ్రమ, విద్య, స్థిరమైన అభివృద్ధి శ్రీసిటీ దార్శనికతకు తార్కాణమని ఆయన స్పష్టం చేశారు.

 

గత మూడు నెలల్లో హిరోషిమా, టొయామా, ఎహిమే ప్రాంతాల నుండి పలువురు జపనీస్ ప్రతినిధులు శ్రీసిటీని సందర్శించారని చెబుతూ, ఇది ఆ దేశానికి చెందిన పారిశ్రామిక సంస్థలు శ్రీసిటీకి ఇస్తున్న ప్రాముఖ్యతను తెలియచేస్తోందని పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రం ముందంజలో ఉందని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పెట్టుబడిదారులకు సత్వర అనుమతులు, ఇతర పలు ప్రయోజనాలు అందించడం ద్వారా శ్రీసిటీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందని ఆయన తెలిపారు.

 

ఈ సమావేశంలో జపాన్ భారత రాయబారి ఓనో కేయిచీ, భారత జపాన్ రాయబారి శిబి జార్జ్ (వర్చువల్ గా), IJBCC చైర్మన్ ఒంకర్ ఎస్. కన్వార్, JIBCC చైర్మన్ తత్సుఓ యాసునాగా, జపాన్ ఎకనామిక్, ట్రేడ్ మరియు ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ గాకు యోడా మరియు పలువురు ఉన్నత స్థాయి పారిశ్రామిక ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 

1966లో స్థాపించబడిన IJBCC, ఇండియా-జపాన్ వాణిజ్య, పెట్టుబడి, సాంకేతిక సహకారాన్ని ప్రోత్సహించే ప్రముఖ వేదికగా కొనసాగుతోంది. ఫిక్కీ భారత వ్యాపార రంగ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తూ, అంతర్జాతీయ వాణిజ్య భాగస్వామ్యాలను సమర్థంగా ముందుకు తీసుకెళ్తోంది.

 

Related posts

రానున్న సంవత్సరంలోని పంచాయితీ రాజ్, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలి: ఆం.ప్ర రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని

Garuda Telugu News

సత్యవేడును ప్రగతి వైపు నడిపిద్దాం

Garuda Telugu News

భార్యపై అనుమానంతో ఆమె నాలుక కత్తిరించి, తలపై రోకలిబండతో కొట్టి చంపిన కామారెడ్డి వాసి

Garuda Telugu News

Leave a Comment