
*’జగన్ ను క్షమించి వదిలేస్తున్నా’*
*జగన్ చేస్తున్న ఆరోపణలు గందరగోళానికి దారితీస్తున్నాయి*
*తప్పుడు ప్రచారానికి తెరదించాలని నిర్ణయించుకున్నా*
*జగన్ ప్రతిపక్ష హోదాపై స్పందించిన స్పీకర్*
*ప్రతిపక్ష హోదాపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హైకోర్టుకు కూడా వెళ్లారని ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. ప్రతిపక్ష నాయకుడిగా తనను ప్రకటించేలా ఆదేశించాలని కోర్టులో ఆయన పిటిషన్ వేశారని చెప్పారు. ఇందులో సభాపతిని, శాసన వ్యవహారాల మంత్రిని ప్రతివాదులుగా చేర్చారని పేర్కొన్నారు. న్యాయ ప్రక్రియ కొలిక్కి వచ్చేవరకు తాను వేచి చూద్దామని అనుకున్నట్లు వివరించారు. కానీ ఇటీవల కాలంలో జగన్, వైఎస్సార్సీపీ నేతల వ్యాఖ్యలు తన దృష్టికి వచ్చాయని వెల్లడించారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా జగన్‌కు ప్రతిపక్ష హోదాపై సభలో స్పీకర్ ప్రకటన చేశారు. స్పీకర్‌కు హైకోర్టు సమన్లు జారీచేసిందని కూడా వార్తలు వస్తున్నాయని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. జగన్ పిటిషన్‌కు విచారణ అర్హత ఉందో లేదో ఇంకా నిర్ధారణ జరగలేదన్నారు. కానీ ఆయన నిరాధార ఆరోపణలతోనే తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని తెలిపారు. జగన్ చేస్తున్న ఆరోపణలు గందరగోళానికి దారితీస్తున్నాయని చెప్పారు. అందుకే తప్పుడు ప్రచారానికి తెరదించేందుకు నిర్ణయించినట్లు వివరించారు. “లోక్‌సభలో టీడీపీ నేత ఉపేంద్రకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారనేది అవాస్తవం. నాడు లోక్‌సభలో టీడీపీ గ్రూపు నేత నాయకుడిగానే గుర్తించారు. ఏమీ తేలకముందే ప్రతిపక్ష హోదాపై జగన్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ఎంతటి వారిపైనైనా అసత్యాలు ప్రచారం చేసే ధోరణితో జగన్ వెళ్తున్నారు. తప్పుడు ప్రచారానికి తెరదించేందుకు రూలింగ్ ఇవ్వాలని నిర్ణయించానని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తిలిపారు.*
*అభియోగాలు, బెదిరింపులతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాకు గతేడాది జూన్ 24న లేఖ రాశారు. ప్రతిపక్ష హోదా గురించి ఆయనకు అన్నీ తెలుసని మాట్లాడుతున్నారని, అన్నీ తెలిసే వివాదం చేస్తున్నారన్నారు. ఈ ధోరణి ఇలానే కొనసాగితే ఏం చర్య తీసుకోవాలనేది నిర్ణయిస్తా. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే సరైన సంఖ్యాబలం ఉండాలని చట్టం చెబుతోంది. 175 మంది సభ్యులున్న శాసనసభలో కనీసం 18 మంది సభ్యుల బలం ఉంటే తప్ప ఇది రాదని, కనీసం 10 శాతం సభ్యులుంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందనే నిబంధనను జగనే గతంలో సభలో ప్రస్తావించారని గుర్తు చేశారు. ఇవన్నీ తెలిసి కూడా జగన్ చేసిన సంధి ప్రేలాపలనలను సభాపతి హోదాలో క్షమించి వదిలేస్తున్నానని అయ్యన్న వ్యాఖ్యానించారు. సభకు దూరంగా ఉంటున్న ఎమ్మెల్యేలు ప్రజలు తమను ఎందుకు గెలిపించారో ఆలోచించాలని అయ్యన్న సూచించారు. అసెంబ్లీకి రాకుంటే తమ నియోజకవర్గ ప్రజల సమస్యలు ఎవరు లేవనెత్తుతారని ప్రశ్నించారు. ఇవన్నీ గ్రహించి శానససభకు రావాలని వైఎస్సార్సీపీ సభ్యులను కోరుతున్నట్లు చెప్పారు. ఈ విషయంపై సభా సంఘానికి నివేదించాలని స్పీకర్ను లోకేశ్, నాదెండ్ల మనోహర్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి కోరారు. దీనిపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని అయ్యన్నపాత్రుడు గారు పేర్కొన్నారు.

