Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

శ్రీసిటీని సందర్శించిన జపాన్-ఎహైమ్ రాష్ట్ర ప్రతినిధుల బృందం

 

శ్రీసిటీని సందర్శించిన జపాన్-ఎహైమ్ రాష్ట్ర ప్రతినిధుల బృందం

శ్రీసిటీ, ఫిబ్రవరి 04, 2025:

పెట్టుబడి అవకాశాల పరిశీలనలో భాగంగా జపాన్‌లోని ఎహైమ్ రాష్ట్రానికి చెందిన 25 మంది ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం శ్రీసిటీని సందర్శించింది. గవర్నర్ టోకిహిరో నకమురా నేతృత్వంలో విచ్చేసిన బృందానికి శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి సాదర స్వాగతం పలికారు. శ్రీసిటీ ప్రత్యేకతలు, వివిధ రంగాలకు చెందిన అంతర్జాతీయ పరిశ్రమల ఉనికి గురించి వివరించారు. ఎహైమ్ కు చెందిన వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల తయారీ పరిశ్రమ యూనిచార్మ్ సహా 30 కు పైగా జపాన్ కంపెనీల ఏర్పాటుతో దేశంలో రెండవ అతిపెద్ద జపనీస్ పరిశ్రమల కేంద్రంగా శ్రీసిటీ అవతరించిందని చెప్పారు.

గవర్నర్ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ, ఆంధ్రప్రదేశ్ పెట్టుబడిదారుల అనుకూల విధానాలను డా. సన్నారెడ్డి హైలైట్ చేశారు. వేగవంతమైన అనుమతులు, రంగాలవారి నిర్దిష్ట ప్రోత్సాహకాలు, ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ తదితర అంశాల గురించి వివరించారు. శ్రీసిటీలో పరిశ్రమల స్థాపనతో బలమైన ఉనికిని చాటాలంటూ ఎహైమ్ రాష్ఠ్ర పారిశ్రామికవేత్తలను ఆయన ఆహ్వానించారు.

పర్యటనలో పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడి అవకాశాలు, శ్రీసిటీ సమగ్ర పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థ అంశాలపై ప్రతినిధి బృందం చురుగ్గా చర్చలు జరిపింది. ప్రపంచ శ్రేణి పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేయడంలో యాజమాన్య కృషిని అభినందించిన గవర్నర్ నకమురా, శ్రీసిటీలోని విశాల స్థలం, అద్భుత మౌళిక సదుపాయాలు, పెట్టుబడిదారులకు అనువైన పారిశ్రామిక వాతావరణాన్ని ప్రశంసించారు. శ్రీసిటీలో ఉన్న జపనీస్ పారిశ్రామిక ప్రవాస సిబ్బంది పట్ల కనబరుస్తున్న శ్రద్దను కొనియాడుతూ, శ్రీసిటీతో బలమైన వ్యాపార బంధం కోసం తాము ఎదురు చూస్తున్నామని వ్యాఖ్యానించారు.

ప్రతినిధి బృందంలో ఎహైమ్ అసెంబ్లీ ఛైర్మన్ హిరోమాసా మియాకే తో పాటు ప్రభుత్వం, బ్యాంకింగ్ రంగం, వివిధ వ్యాపార సంఘాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శ్రీసిటీ అధునాతన మౌళిక వసతులను వీక్షించిన ప్రతినిధులు, డైకిన్ ఏసీల తయారీ పరిశ్రమను సందర్శించి, అక్కడ కార్యకలాపాలను పరిశీలించారు. ప్లాంట్ అధికారులతో చర్చించారు.

కాగా, సుమిటోమో వంటి ప్రధాన సంస్థల ఉనికితో నౌకా నిర్మాణం, కాగితం తయారీ, రసాయనాలు, ఖచ్చితత్వ యంత్రాల తయారీకి ఎహైమ్ రాష్ట్రం ప్రధాన కేంద్రంగా ఉంది. ప్రపంచ సుస్థిరత లక్ష్యాలకు అనుగుణంగా పునరుత్పాదక శక్తి, అధునాతన పరికరాల తయారీలోనూ ఈ రాష్ఠ్రం మంచి పురోగతిని సాధిస్తోంది.

Related posts

పాత కూరగాయల మార్కెట్ లో గల సమస్యలన్నిటికీ త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపుతాం…..

Garuda Telugu News

నాపై దాడి జరిగింది.. పోలీసులకు మనోజ్ ఫిర్యాదు

Garuda Telugu News

ఇది జగన్‌ ప్యాలెస్‌ కాదయ్యా.. ఎందుకింత బందోబస్తు’.. మంత్రి లోకేశ్‌ ఆన్‌ ద ఫైర్‌..

Garuda Telugu News

Leave a Comment