Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

రాబడి ఉన్నా ..రెవిన్యూ లో సిబ్బంది లేరు…

రాబడి ఉన్నా ..రెవిన్యూ లో సిబ్బంది లేరు…

 

ఉద్యోగులు తక్కువ… పని భారం ఎక్కువ…

 

టీటీడీ రెవెన్యూ, పంచాయతీలో ఫైళ్లు కదలట్లేదు

 

గరుడ తెలుగు న్యూస్:

 

తిరుమల కొండపై టీటీడీలో కీలక విభాగమైన రెవెన్యూ ,పంచాయతీ విభాగం ఇప్పుడు సిబ్బంది లేక బోసిపోయి కనిపిస్తోంది. ఈ విభాగం ద్వారా టీటీడీకి నెలకు రెండున్నర కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతోంది. అంటే ఏడాదికి 30 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వస్తున్న రెవెన్యూ పంచాయతీ విభాగాన్ని టిటిడి ఉన్నతాధికారులు కావాలనే నిర్వీర్యం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. తిరుమలలో 1310 దుకాణాలు,26 హోటల్లు, 612 హాకరు లైసెన్సులు, వీటన్నిటి రెవిన్యూ రాబడి కి సంబంధించిన అన్ని వ్యవహారాలు టీటీడీ పంచాయతీ రెవెన్యూ విభాగం పరిధిలో ఉంటుంది. వీటి నిర్వహణ లైసెన్సుల వ్యవహారాల ద్వారా మాసానికి అద్దెల రూపంలో నెలకు రెండున్నర కోట్ల నుండి మూడు కోట్ల రూపాయల వరకు ఆదాయం టిటిడి కి వసూలు అవుతోంది. ఈ విభాగంలో తిరుమల సమస్యలపై ఇక్కడి స్థానికుల స్థితిగతులపై పూర్తిస్థాయి అవగాహన కలిగిన అధికారులు మాత్రమే సమర్థవంతంగా విధులు నిర్వర్తించగలుగుతారు. అయితే అక్రమ సంపాదన కోసం అవినీతి అక్రమాలు ఇష్టారాజ్యంగా చేసి, తిరుమలను భ్రష్టు పట్టించారనే ఆరోపణలపై గత ఐదేళ్లుగా ఈ విభాగంలో సర్వాధికారిగా పెత్తనం చలాయించిన ఏఈఓ స్థాయి అధికారిని ఇటీవలే బదిలీ చేశారు. కానీ సిబ్బంది కొరత పై మాత్రం ఎందుకు ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు.

సుమారు 26 మంది సిబ్బంది ఉండాల్సిన ఈ విభాగంలో ప్రస్తుతం కేవలం పట్టుమని పదిమంది సిబ్బంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు . తక్కువ స్థాయిలో ఉన్న సిబ్బంది పని ఒత్తిడి భారంతో అసలు చేయాల్సిన పని కూడా సక్రమంగా చేయలేక చేతులెత్తేస్తున్నారు. తిరుమల వాసులకు ఈ కార్యాలయంలో ఏ చిన్న పని చేసుకోవాలన్నా సమస్యలు విన్నవించుకోవాలన్నా, ఎవరికి విన్నవించుకోవాలో ఎవరికి వినతిపత్రం ఇవ్వాలో కూడా దిక్కుతోచని పరిస్థితి ఎదురవుతోంది. కార్యాలయంలో దరఖాస్తులు కుప్పలు కుప్పలుగా పేరుకుపోతున్నాయి. ఫైళ్లు కదలడం లేదు. అసలు ఫైళ్లు రాయాల్సిన క్లర్కులే వారి స్థానాల్లో లేరు. ఉన్న క్లర్కులు కూడా ఉన్నతాధికారులు ఆదేశించనిదే ఫైళ్ళు రూపాంతరం చెందవు. ఉన్నతాధికారులు ఆదేశించాలంటే ఎంతో పెద్ద స్థాయిలో పైరవీలు ఒత్తిడిలు రానిదే ఆదేశించరు.

ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో తమ బాధలు సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాకుండా వెంకన్నా మా బాధలు నువ్వైనా పట్టించుకో స్వామి అంటూ వేడుకుంటున్నారు. తిరుమల రెవెన్యూ పంచాయతీ కార్యాలయంలో

చాలాకాలంగా రెండు సూపర్డెంట్ స్థాయి అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఏఈఓ స్థానం కూడా ఖాళీ అయింది. అంతకుమునుపే చాలా కాలం నుండి డేటా ఎంట్రీ ఆపరేటర్, కంప్యూటర్ ఆపరేటర్, అటెండర్లు, ఇద్దరు క్లర్కులు, పోస్టులు కూడా ఎవరిని భర్తీ చేయకుండా ఖాళీగా అలాగే ఉంచేశారు.

ఈ విభాగంలో పని ఒత్తిడి అధికంగా ఉండడం, ఎక్కువ భాగం రిస్క్ తో కూడుకున్న పని కావడంతో విధులు నిర్వహించడానికి అనుభవం కలిగిన ఉద్యోగులు ఆసక్తి చూపడం లేదు. పైగా దుకాణాలు హాకరు లైసెన్సులు రెన్యువల్స్ పేరిట, అనధికారిక తట్టల పేరిట ఇష్టారాజ్యంగా బోగస్ లైసెన్సులు సృష్టించి తిరుమలను భ్రష్టు పట్టించిన ఇంతకాలం పనిచేసి బదిలీ అయిన రెవిన్యూ అధికారి తాను చేసిన తప్పులు ఎక్కడ బయట పడుతుందోననే దురాలోచనతో తనకంటే కిందిస్థాయిలో ఉద్యోగుల్లో సమర్థత కలిగిన సిబ్బందిని నియమించుకోకుండా అంతా తానే అయి చక్రం తిప్పాడని బహిరంగ విమర్శలు వినిపించాయి. ప్రస్తుతం ఈ కార్యాలయంలో విభాగ అధిపతిగా పనిచేస్తున్న ఎస్టేట్ ఆఫీసర్ స్థాయి అధికారి ప్రభుత్వం నుండి డిప్యూటేషన్ పై నియమితులు కావడంతో ఆయనకు స్థానిక సమస్యలపై అవగాహన కల్పించడంలో కిందిస్థాయి సిబ్బంది ఫీడ్ బ్యాక్ ఇవ్వడంలో లోపం ఇబ్బంది పెడుతోంది. ఈ పరిస్థితులపై టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి, ఈవో శ్యామల రావు వెంటనే చర్యలు తీసుకొని అవినీతిపరులను కాకుండా, సమర్థులైన నిజాయితీగల తిరుమల సమస్యలపై అవగాహన కలిగిన సిబ్బందిని ఖాళీగా ఉన్న స్థానాల్లో నియమించి టిటిడి రెవెన్యూ పంచాయతీ వ్యవస్థను మరింత పటిష్ట వంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు.

Related posts

గ్రామ మండల అర్బన్ కమిటీల ప్రమాణ స్వీకారం …

Garuda Telugu News

మసీదు కమిటీలు ముతవల్లీలు ఇమామ్ మౌజన్ లకు జీతాలు ఇవ్వాల్సిందే…

Garuda Telugu News

హైవే పై ప్రమాదం.. ఒకరి మృతి

Garuda Telugu News

Leave a Comment