
*శ్రీసిటీ, జనవరి 16, 2025:*
స్పేస్ డాకింగ్ ప్రయోగం (స్పేడెక్స్) విజయవంతం కావడంపై ఇస్రో చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ మరియు ఇస్రో బృందానికి శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు. అంతరిక్షంలో ఉపగ్రహాల అనుసంధానం (డాకింగ్) చేయగల సత్తా కలిగిన 4వ దేశంగా భారతదేశం నిలిచిందని పేర్కొంటూ, ఈ విజయాన్ని సాధించిన ఇస్రో బృందం కృషి మరియు అంకితభావాన్ని ఆయన ప్రశంసించారు.
ఇస్రో కొత్త ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ వి. నారాయణన్‌కు అభినందనలు తెలియజేసిన డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, అంతరిక్ష పరిశోధనల పురోగతిలో భారతీయ శాస్త్రవేత్తల అసాధారణ నైపుణ్యాన్ని ప్రతిఫలిస్తూ, స్పేస్ డాకింగ్ విజయంతో ఇస్రో మనందరికీ గర్వకారణంగా నిలిచిందన్నారు.
డాక్టర్ నారాయణన్ నాయకత్వంలో సాధించిన ఈ మైలురాయి భవిష్యత్ మానవ అంతరిక్షయాన మిషన్‌లకు గట్టి పునాది వేస్తుందని, అంతర్జాతీయ అంతరిక్ష రంగంలో భారతదేశ స్థాయిని బలోపేతం చేస్తుందని ఆయన అన్నారు. ఇస్రో అంకితభావాన్ని మరియు శ్రమను అభినందిస్తూ, వారి విజయ పరంపర కొనసాగాలంటూ శుభాకాంక్షలు తెలిపారు.
